iDreamPost

దుబ్బాక ఎమ్మెల్యే నోటి దురుసు.. కమలం గూటిలో కాంట్రవర్సీ పాఠాలు

దుబ్బాక ఎమ్మెల్యే నోటి దురుసు.. కమలం గూటిలో కాంట్రవర్సీ పాఠాలు

వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది భారతీయ జనతా పార్టీ. గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకు అందరిదీ ఒకే స్టైల్. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక కాంట్రవర్సీకి తెరతీస్తూనే ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నగరంలో అలజడికి కారణమయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో రాటుదేలుతున్న కాషాయపార్టీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరంభించిన సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ ఇప్పుడు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం అలాంటి నోటిదురుసునే ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపై పరోక్షంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఆశ జనించింది. ఆ ఆశను నెరవేర్చుకునేందుకు గ్రేటర్ ఎన్నికలను వేదికగా మలుచుకుంది రాష్ట్ర బీజేపీ. ఓట్ల కోసం నానాయాగి చేసింది. వివాదస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కించింది. పాకిస్తానీలు, రోహింగ్యాలు, జాతి వ్యతిరేకులు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కామెంట్స్ తో ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు యత్నించింది. గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సొంతమవ్వడంతో బీజేపీలో ఉత్సాహం రెట్టించింది. ఇప్పుడు రాష్ట్రంలో బలం పెంచుకోవడంపై దృష్టి సారించిన బీజేపీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడింది. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్థానికంగా పట్టున్న నేతపై కన్నేసింది. మాజీ హోంమంత్రి జానారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆయన తనయుడిని నాగార్జునసాగర్ నుంచి పోటీకి నిలబెట్టవచ్చే ఆలోచన చేసింది. అందుకోసం సంప్రదింపులు కూడా జరిపింది. కానీ బీజేపీ ప్రయత్నానికి చెక్ పెడుతూ జానారెడ్డి తాను కాషాయపార్టీలో చేరబోవడం లేదంటూ తేల్చిచెప్పారు. జానారెడ్డి వివరణపై ఘాటుగా స్పందించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.

గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అత్తాపుర్ కార్పోరేటర్ సంగీత విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్ రావు జానారెడ్డి పట్ల అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆయనెవరో ముసలాయన… ‘నేను పుట్టింది కాంగ్రెస్ లోనే, చచ్చేది కాంగ్రెస్ లోనే… బీజేపీలోకి పోట్లేదు’ అన్నాడు. భవిష్యత్తులో బీజేపీలోకి వస్తే, బిడ్డా… బడిత పూజ చేస్తమని చెప్పాలె…” అంటూ జానారెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి నాయకులు, కార్యకర్తలు లేక పక్కచూపులు చూస్తలేమని, పెద్దమనిషిని గౌరవిద్దామనుకున్నామని, వస్తే దండేసి దండం పెడతామని, లేదంటే గట్టి సమాధానం చెబుతామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, రాష్ట్ర మాజీ హోంమంత్రిగా జానారెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. వరుస కాంగ్రెస్ వైఫల్యాల కారణంగా ఆయన కొంతకాలంలో పార్టీలో చురుకుగా కనిపించడం లేదు. దీంతో ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలనుకుంది బీజేపీ. ఇప్పుడా ప్రయత్నం ఫలించకపోవడంతో ఎదురుదాడి మొదలుపెట్టింది. బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగిన రఘునందర్ రావుకు చదువరిగా, వివేకవంతుడిగా గుర్తింపు ఉండేది. కానీ పదవిలో రాగానే ఆయనా… మిగతా నేతల మాదిరిగానే అడ్డూ అదుపులేని మాటలు మాట్లాడుతుండడం విమర్శలకు తావిస్తోంది. జానారెడ్డితో పాటు మంత్రి హరీష్ రావు పైనా అలాంటి వ్యాఖ్యలే చేశారు రఘునందన్ రావు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే హరీశ్ రావును దుబ్బాకలో తంతే శంకరగిరి మాన్యాలు పట్టాడని ఘాటు విమర్శలు చేశారు. డిల్లీకి వెళ్లి వంగి వంగి సలామ్‌లు చేస్తున్నాడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తరువాత నాగార్జున సారగ్ లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ ఇప్పటి నుంచే దూకుడును ప్రదర్శిస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు తమదే అని చెప్పుకునే అధికార పార్టీకి నాగార్జున సాగర్ లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. అందుకోసం బీజేపీ నేతలు నోటి దురుసును ప్రదర్శిస్తున్నారు. అటు ప్రత్యర్థి పార్టీలతో పాటు అధికారులపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలే చేశారు రంఘునందర్ రావు. డీజీపీ పింక్ యూనిఫాంలో పనిచేస్తున్నారని, పదవీ విరమణ కాగానే గులాబీ కండువా కప్పుకుంటాడని విమర్శించారు. మొత్తానికి బీజేపీ నేతల తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వైఖరిని పార్టీకి నష్టం చేకూర్చేదిగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇప్పటికైనా కమలం గూటి పక్షులు గొంతు సవరించుకుంటాయో లేదో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి