iDreamPost

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాలి – కిషన్‌ రెడ్డి

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాలి – కిషన్‌ రెడ్డి

రాయలసీమ నిజంగా అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాలని బీజేపీ నేత, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం రాయలసీమ ప్రజలు బీజేపీ జెండాను పట్టుకోవాలని కోరారు. ఇప్పటివరకు పాలించిన పార్టీలు రాయలసీమ కోసం ఏం చేశాయో చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ వైఎస్సార్‌ కడప జిల్లా కడప నగరంలో బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌ రెడ్డి రాయలసీమ అభివృద్ధి, బీజేపీ పాలన సహా పలు అంశాలపై మాట్లాడారు.

‘‘ రాయలసీమ ప్రజలకు న్యాయం జరగాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. రాయలసీమ కోసం బీజేపీ గొంతెత్తింది. సీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాలి. ఇటీవల 18వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రహదారులు బాగున్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే అటల్‌ బిహారీ వాజపేయి జాతీయ రహదారులను నిర్మించడం ప్రారంభించగా.. దాన్ని మోడీ కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ ఐదు కేజీల బియ్యం ఇస్తోంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేస్తోంది. ప్రతి పేద కుటుంబానికి ఐదులక్షల రూపాయల వరకు ఉచితవైద్యం అందించేందుకు ఆయూష్‌మాన్‌ భారత్‌ పథకం అమలుచేస్తోంది. రైతులకు ప్రతి ఏడాది ఆరువేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది.

ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ అప్పులు వస్తాయా..? ఎక్కడ అప్పులు చేద్దామా..? అని ఆలోచిస్తోంది. రానున్న రోజుల్లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పథకాలు కొనసాగించే పరిస్థితి లేదు. ప్రాజెక్టు పనులు జరగవు. అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పులు ఇచ్చేవారు ఎన్నాళ్లు ఇస్తారు. ఏపీలో, తెలంగాణలో పాలన బాగుండాలి అంటే బీజేపీ అధికారంలోకి రావాలి. కుటుంబ రాజకీయాలకు బీజేపీ దూరం. అందుకే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి పట్టం కట్టారు. అన్ని రాష్ట్రాలలోనూ కుటుంబ పాలన పోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో చేరితే అక్రమకేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. వ్యాపారాన్ని దెబ్బతీస్తానని, భూములు ఆక్రమించుకుంటామని, ఇళ్లు తగులపెడతామని బెదిరిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడకూదని దౌర్జన్యం చేస్తున్నారు. ఏపీలో అవినీతి పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రూపాయి బియ్యం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన సహాయం ఏపీకి చేస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాయలసీమకు అండగా ఉంటుంది. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. నిజంగా రాయలసీమ అభివృద్ది జరగాలంటే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాలి. అది బీజేపీతోనే సాధ్యం. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ పని చేయాలి.

గండికోటను అభివృద్ధి చేస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చేలా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే శ్రీశైలం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా నిధులు ఇచ్చాం. కోస్టల్‌ సర్కూట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రైల్వే శాఖ, పర్యాటక శాఖ తరపున రాయలసీమకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం పనిచేస్తాను..’’ అని కిషన్‌ రెడ్డి చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి