iDreamPost

చంద్రబాబుకు షాకిచ్చిన బిజెపి.. అచ్చెన్న అరెస్టులో తప్పులేదు

చంద్రబాబుకు షాకిచ్చిన  బిజెపి.. అచ్చెన్న అరెస్టులో తప్పులేదు

అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఆధారాలుంటే అరెస్టులు చేయాల్సిందే అంటూ బిజెపి స్పష్టం చేసింది. ఇఎస్ఐలో జరిగిన భారీ కుంభకోణంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ అచ్చెన్నాయుడును ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ప్రతిపక్షాల నేతల నుండి మద్దతు కూడగట్టుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నాడనటంలో సందేహం లేదు. అయితే అచ్చెన్న అరెస్టును కమలం పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్ధించాడు. కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్న పాత్రపై ఆధారాలుంటే అరెస్టు చేయాల్సిందే అని కన్నా చెప్పటంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లే అనిపిస్తోంది.

అవినీతికి ఎవరు పాల్పడినా వారి పాత్రపై స్పష్టమైన ఆధారాలుంటే అరెస్టు చేయటంలో తప్పే లేదని కన్నా అభిప్రాయపడ్డాడు. ఇదే విషయమై మరో నేత పురంధేశ్వరి మాట్లాడుతూ ఇఎస్ఐ కుంభకోణం బయటపడిందని, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంటు దర్యాప్తు చేస్తున్న విషయం తనకు తెలుసన్నారు. కానీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రపై తనకు కచ్చితమైన సమాచారం లేదన్నారు. ఈరోజు ఉదయమే ఏసిబి అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసినట్లు చూశానని పురంధేశ్వరి చెప్పటం గమనార్హం.

మొత్తం మీద ప్రతి విషయంలోను చంద్రబాబుకు బలమైన మద్దతుదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నా టిడిపిలో సీనియర్, కీలక నేతైన అచ్చెన్నాయుడు అరెస్టును సమర్ధిస్తాడని ఎవరూ ఊహించలేదు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం లాగే అచ్చెన్న అరెస్టును కూడా ఖండిస్తాడని టిడిపి నేతలు అనుకునుంటారు. అయితే తమ ఆలోచనలకు భిన్నంగా కన్నా అచ్చెన్న అరెస్టును సమర్ధించటంతో ఖంగుతినే ఉంటారు. అచ్చెన్నను అరెస్టు చేసినట్లే గడచిన ఏడాదిగా వైసిపి నేతలపై వినిపిస్తున్న అవినీతి ఆరోపణలపైన కూడా దర్యాప్తు చేయించాలని కన్నా డిమాండ్ చేశాడు.

అచ్చెన్న అరెస్టుపై కన్నా స్టాండ్ ఏమిటో తెలిసిపోయింది కాబట్టి ఇక బయటపడాల్సింది సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందన మాత్రమే. మరి వీళ్ళు చంద్రబాబుతో బంధం కారణంగా అచ్చెన్న అరెస్టును వ్యతిరేకిస్తారా ? లేకపోతే అవినీతి జరిగినట్లు ఆధారాలున్న కారణంగా అరెస్టు చేసిన ఏసిబి అధికారులకు మద్దతుగా నిలుస్తార్ చూడాల్సిందే. మొత్తం మీద తనకు బాగా అలవాటైపోయిన సామాజికవర్గం కార్డును చంద్రబాబు, లోకేష్ తో పాటు యావత్ టిడిపి నేతలు ఉపయోగించటం మొదలుపెట్టేశారు. అచ్చెన్న అరెస్టుపై మిగిలిన ప్రతిపక్షాల స్పందన ఎలాగుంటుందో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి