iDreamPost

తిరుపతిలో కూడా వెనుక నుంచి మద్దతే..!

తిరుపతిలో కూడా వెనుక నుంచి మద్దతే..!

తిరుపతి ఉప ఎన్నికలపై స్పష్టత వచ్చేస్తోంది. బీజేపీ అభ్యర్థి కూడా దాదాపు ఖారరయినట్టు కనిపిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ ని బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. దాంతో జనసేనకు మరోసారి మొండిచేయి తప్పలేదు. గ్రేటర్ నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకున్న జనసేనకు ఏపీలో కూడా పోటీకి ముందే బరిలోంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఏకంగా నడ్డాని కలిసి విన్నవించినా పవన్ పట్ల తమకు విశ్వాసం లేదన్నట్టుగా బీజేపీ సంకేతాలు ఇచ్చేసింది. పార్లమెంట్ బరిలో తామే దిగుతామని తేల్చేసింది. ఈ విషయాన్ని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దాని మీద క్లారిటీ ఇచ్చేయడంతో ఇక జనసేనకు మరోసారి నిరాశ తప్పడం లేదనే చెప్పవచ్చు.

ఏపీలో తాము బలపడేందుకు బీజేపీతో మైత్రికి సిద్ధపడినట్టు పవన్ ప్రకటించారు. కానీ తీరా చూస్తే పవన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతుందా అనే అబిప్రాయం కనిపిస్తోంది. చివరకు జనసేన కార్యక్రమాలను కూడా బీజేపీ దిశానిర్దేశం చేసే పరిస్థితి ఏర్పడడంతో జనసేన పూర్తిగా బీజేపీకి ఉపగ్రహంగా మారినట్టయ్యింది. అమరావతి కోసం కవాతు చేయాలన్న జనసేనాని యత్నానికి బీజేపీ బ్రేకులు వేసింది. ఆ తర్వాత దుబ్బాక, గ్రేటర్ ప్రచారానికి సన్నద్ధమయి కనిపించినా ససేమీరా అన్నది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నేతలయితే తాము పొత్తు కూడా పెట్టుకోలేదని, పవన్ వచ్చి ప్రకటించారంటూ ఘాటుగానే స్పందించారు. ఇక తాజాగా తిరుపతిలో పోటీకి ఎంతగానో ప్రయత్నం చేసినట్టు కనిపించినా మళ్లీ పవన్ అభిమానులకు నిరాశ తప్పలేదు.

అటు తెలంగాణాలో, ఇటు ఏపీలో కూడా జనసేనకు అవకాశాలు ఇచ్చేందుకు బీజేపీ అంగీకిరంచడం లేదన్నది ఇటీవలి వరుస అనుభవాలు చెబుతున్నాయి. పవన్ ని కేవలం ప్రచారం కోసం ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. అది కూడా అవసరమైన మేరకు మాత్రమే పరిమితం చేసే లక్ష్యంతో సాగుతున్నట్టు అంతా భావిస్తున్నారు. దాంతో అనేక చోట్ల పవన్ అభిమానులు తీవ్ర నైరాశ్యంలో మునుగుతున్నారు. జనసేనని నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదనే లెక్కలు వేస్తున్నారు. ఆ క్రమంలోనే కొందరు జనసేన జెండా మోయడం కన్నా నేరుగా బీజేపీ గానీ, వైఎస్సార్సీపీలో చేరడం గానీ చేస్తే రాజకీయ భవిష్యత్ అయినా ఉంటుందనే భావనతో ఉన్నట్టు చెబుతున్నారు.

ఇక బీజేపీ తన అభ్యర్తిగా దాసరి శ్రీనివాస్ ని ఎంపికి చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కూడా వివిధ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. తిరుపతి రాజకీయాల్లో కొత్త నేతగా ఆయన అడుగుపెడుతున్నారు. వైఎస్సార్సీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని బరిలో దింపుతున్న తరుణంలో బీజపీ కూడా కొత్త ఫేస్ ని తెరమీదకు తెచ్చింది. టీడీపీ మాత్రమే మాజీ మంత్రి, సీనియర్ నేత పనబాక లక్ష్మిని పోటీలో దింపే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖల్లో కీలక అధికారిగా వ్యవహరించిన దాసరి శ్రీనివాస్ ఏమేరకు ప్రభావం చూపగలరు, బీజేపీ బలం ఆయనకు ఎంతవరకూ ఉపయోగపడుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి