iDreamPost

దేశవ్యాప్తంగా జరిగిన ఉప పోరులో సత్తాచాటిన కాషాయ దళం

దేశవ్యాప్తంగా జరిగిన ఉప పోరులో సత్తాచాటిన కాషాయ దళం

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలోని మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో 40 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొని కమల వికాసానికి తిరుగులేదని నిరూపించుకుంది.ఉప ఎన్నికల ఫలితాలలో కేవలం 12 స్థానాలు స్థానాలకే పరిమితమై కాంగ్రెస్ కుదేలైంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా ఆరు స్థానాలలో బీజేపీ, ఒకచోట ఎస్పీ విజయం సాధించాయి. గుజరాత్‌లో ఎనిమిది స్థానాలలో బీజేపీ అన్నిచోట్లా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది.రెండు పార్టీల మధ్య దాదాపు 20శాతం ఓట్ల తేడా ఉంది. భాజపాకు 55శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.కర్ణాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండింటిలో బీజేపీ విజయం సాధించి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.ఇక్కడ నాలుగు స్థానాలలో బీజేపీ,మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 56శాతం ఓట్లు పోలవ్వగా రెండోస్థానంలో ఉన్న భాజపాకు 36శాతం ఓట్లు పోలయ్యాయి. ఝార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ ఒక స్థానంలో, జేఎంఎం మరోస్థానంలో గెలుపొందాయి.హరియాణాలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మరో ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి, మరోస్థానంలో ఎన్‌డీపీపీ అభ్యర్థి విజయం సాధించారు.ఇక్కడ రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ ఒక్కశాతం ఓట్లు కూడా సాధించకపోవడం గమనార్హం. కాగా బీజేపీ పార్టీ 14శాతం ఓట్లు వచ్చినప్పటకీ నామమాత్ర పోటీని ఇచ్చింది.ఒడిశాలో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో అధికార బిజూ జనతాదళ్‌(బీజేడీ) విజయం సాధించి సత్తా చాటింది.

ఇక దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలలో కూడా కమలం గుబాళించింది. బీజేపీ అధికారం నిలుపుకోవడానికి ఉప ఎన్నికలు జరిగిన 28 స్థానాలలో ఖచ్చితంగా 8 స్థానాలు గెలవాల్సిన ఉండగా 19 సీట్లలో విజయం సాధించింది. మరో 9 స్థానాలలో కాంగ్రెస్‌ గెలుపు బావుటా ఎగురవేసింది.230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో అధికారానికి 116 సీట్లు అవసరం కాగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ని దాటడంతో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది.అయితే గ్వాలియర్- చంబల్ ప్రాంతంపై తన పట్టును నిలుపుకోవడంలో కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు.ఇక్కడ జరిగిన ఉప పోరులో ఆయన మద్దతుదారులు 5 మంది కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిని చవి చూడటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఉత్కంఠ లేపిన తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చింది. అయితే బీజేపీ,అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్ల లెక్కింపు చివరి రౌండ్ వరకు హోరాహోరీ పోరు కొనసాగింది. చివరివరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో 1079 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి