iDreamPost

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన బిజెపి నేత

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన బిజెపి నేత

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కోల్ కతా లో బిజెపి భారీ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్  వైస్ ప్రెసిడెంట్ చంద్ర కుమార్ బోస్ పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా ట్వీట్ చెయ్యడం పెద్ద దుమారాన్ని లేపుతుంది.

బిజెపి పశ్చిమ బెంగాల్  వైస్ ప్రెసిడెంట్ చంద్ర కుమార్ బోస్ పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ ) కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ భారతదేశం అన్ని వర్గాలను మతాలను ఆహ్వానించే దేశమని స్పష్టం చేశారు. సిఏఏ కి మతంతో సంబంధం లేనప్పుడు మనం హిందూ, సిక్కు, బౌద్ధ, క్రైస్తవులు, పార్సీలు మరియు జైనులు గురించి మాత్రమే ఎందుకు మాట్లాడున్నాం ముస్లింలను కూడా ఎందుకు చేర్చకూడదు? మనం పారదర్శకంగా ఉండాలి. భారతదేశాన్ని ఇతరదేశాలతో పోల్చవద్దని ఇది అన్ని మతాలు మరియు వర్గాలకు చెందిన దేశమని బోస్ తన తదుపరి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈయన స్వయానా సుభాష్ చంద్రబోస్ కి ముని మనమడు (చంద్ర కుమార్ బోస్ తండ్రి ఆమియా నాథ్ బోస్ గతంలో ఫార్వర్డ్ బ్లాక్ తరుపున ఎంపీగా వ్యవహరించారు)లండన్ లో గ్రాడుయేట్ చేసిన ఈయన ఐఐఎం కోల్ కతా నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కొన్నాళ్ళు టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబందించిన రహస్య పత్రాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ మోడీ నేతృత్వంలో బిజెపి నేతలు బోస్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బిజెపి లో చేరారు. ఆయన 2016 లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు.

కోల్ కతాలో జరిగిన ర్యాలీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఇతర రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘అభినందన్ యాత్ర’ (థాంక్స్ గివింగ్ ర్యాలీ) నిర్వహించారు. , బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్‌కు శరణార్థులుగా వచ్చిన లక్షలాది మంది శరణార్థులకు ప్రధానంగా బెంగాలీ హిందువులకు పౌరసత్వం ఇవ్వడం ద్వారా రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట ఉన్న తూర్పు ప్రాంతంలో ప్రభావం చూపుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

పౌరసత్వం (సవరణ) చట్టం, 2019, ప్రకారం 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు మతపరమైన హింసవలన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాకి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మరియు క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినది. ఈచట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిత్రపక్షం అకాలీదళ్, జెడియు నుండి కూడా నిరసన సెగలు తగులుతున్నాయి. మన దేశ ప్రజాస్వామ్య లౌకిక సూత్రాల ఆధారంగా ముస్లింలకు కూడా పౌరసత్వ సవరణ చట్టంలో చోటు కల్పించాలని అకాలీదళ్ డిమాండ్ చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి