iDreamPost

కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటే రాజకీయాలేంటి సారూ..

కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటే రాజకీయాలేంటి సారూ..

నంధ్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యా వ్యవహారం రాజకీయ పార్టీలకు అవకాశంగా మారడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కొందరు నేతలు చేస్తున్న వాదనలు విడ్డూరంగా కనిపిస్తున్నాయి. సామాన్యుడిని కూడా విచారించేలా చేస్తున్నాయి. పోలీసుల వేధింపులతో అబ్దుల్ సలాం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశారు. అది వాస్తవమా కాదా అన్నది విచారించాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులతో దర్యాప్తు బృందాన్ని నియమించింది. అదే సమయంలో వారిని విధుల్లోంచి తొలగించింది. అరెస్ట్ కూడా చేసి విచారణ చేపట్టింది.

కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారంటే దానికి బలమైన కారణాలుంటాయన్నది కాదనలేని వాస్తవం. అందుకు తగ్గట్టుగా అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ దానికి అడ్డుకట్టవేసేలా చివరకు నిందితులను కాపాడేలా బెయిల్ కోసం ప్రయత్నించిన టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీలలో జగన్ కి ఉన్న ఇమేజ్ ని దెబ్బతీసేందుకు అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యను వాడుకోవాలని ఆపార్టీ చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఓవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తూ, రెండోవైపు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూడడం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణికి దర్పణం పడుతోంది.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో కోణంలో ముందుకొచ్చారు. మత రాజకీయాలకు పెట్టింది పేరయిన బీజేపీ నాయకుడిగా ఆయన ప్రకటన ఆశ్చర్యం కలిగించదు. కానీ మానవత్వం ఉన్న వారందరినీ కలచివేస్తుంది. ఇద్దరు బిడ్డలతో కలిసి భార్యా, భర్త ఆత్మహత్యకు పూనుకోవడం, తమను పోలీసులు వేధించారని ఆరోపణలు చేయడం అందరికీ తెలిసిన సత్యం. దాని వెనుక ఏం కారణాలున్నాయన్నది, అసలు వాస్తవాలు ఏంటన్నది వెలుగులోకి రావాల్సి ఉంది. దానికి అనుగుణంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. చట్టం ప్రకారం ఆత్మహత్యకు పురికొల్పినట్టు ఆరోపణలు రావడంతో కేసు పెట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అందులో పోలీసులయినా, మరొకరయినా చట్ట ప్రకారం అదే ప్రక్రియ. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మాత్రం అబ్దుల్ సలాం ముస్లీం కాబట్టి, పోలీసులను అరెస్ట్ చేశారనే కోణంలో వ్యాఖ్యలు చేయడం అత్యంత విషాదకర అంశంగా కనిపిస్తోంది. మనిషి చనిపోయాడు, ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందనే విషయాన్ని వదిలేసి మైనార్టీలను ప్రభుత్వం వేదిస్తోందంటూ టీడీపీ ఆరోపిస్తుంటే, మైనార్టీల కోసం పోలీసులపై కేసు పెట్టారని బీజేపీ గొంతు వినిపించడం విడ్డూరంగా మారింది.

ఏపీలో మైనార్టీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. అదే సమయంలో మత సామరస్యానికి ప్రాధాన్యతనిస్తోంది. మొదటిది సంక్షేమం టీడీపీకి రుచించడం లేదు. మత సామరస్యం బీజేపీకి గిట్టడం లేదా అని సందేహించాల్సి వస్తోంది. దానికి తగ్గట్టుగానే సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం విమర్శలుకు దారితీస్తోంది. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలలో బలపడతామని బీజేపీ నేతలు చెప్పడం అభ్యంతరం లేదు. కానీ అందుకోసం ఇలాంటి ఆత్మహత్యలపై ప్రభుత్వ చర్యలను మతం కోణంలో చిత్రీకరించాలని యత్నించడం తగదని పలువురు సూచిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులెవరైన సమగ్ర దర్యాప్తు చేయాలని అంతా ఆశిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం దానికి భిన్నంగా చనిపోయింది ముస్లీం కాబట్టి చర్యలు తీసుకుంటారా అంటూ వింత వ్యాఖ్యలు చేయడం విషాదకరంగా భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి