iDreamPost

భీష్మ బ్రేక్ చేయాల్సిన సెంటిమెంట్

భీష్మ బ్రేక్ చేయాల్సిన సెంటిమెంట్

ఇంకో నాలుగు రోజుల్లో నితిన్ భీష్మ వస్తోంది. ఇప్పటికే టీజర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ ఉంది. ఛలోతోనే తన టాలెంట్ రుజువు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోనూ గత నెల రోజులకు పైగా సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పడలేదు. ఒకదాన్ని మించి మరొకటి బోల్తా కొట్టాయి.

ఈ నేపథ్యంలో భీష్మ బాగుంది అనే టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు వస్తాయి. రష్మిక మందన్న గ్లామర్ కూడా బాగా ప్లస్ అవుతోంది. కాకపోతే అభిమానులను ఒక్క విషయం మాత్రం చిన్న టెన్షన్ పెడుతోంది. ఇప్పటిదాకా నితిన్ కు పురాణ పురుషుల పేర్లు, వాళ్లకు సంబంధించిన సంఘటనలు కానీ టైటిల్ గా పెట్టుకుంటే అంతగా కలిసి రాలేదు. ఎలా అంటారా. మీరే చూడండి.

2006లో నితిన్ ‘రామ్’ అనే సినిమా చేశాడు. అందులో కృష్ణంరాజు గారు కూడా ఓ కీలక పాత్ర చేశారు. హీరోయిజం మితిమీరిపోవడంతో పాటు మసాలాలు శృతి మించడంతో బొమ్మ ఆడలేదు. ఆ తర్వాత రెండేళ్లకు 2008లో ‘ద్రోణ’ అనే ఇంకో సినిమా చేశాడు. ప్రియమణి హీరోయిన్. ఫాదర్ సెంటిమెంట్ తో తీసిన యాక్షన్ మూవీ జనానికి ఎక్కలేదు.

2010లో వచ్చిన ‘సీతారాముల కళ్యాణం లంకలో’, 2018లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ రెండూ పోయాయి. పైన చెప్పిన నాలుగు సినిమాల్లో రెండు పురాణ పురుషుల పేర్లు కాగా రెండు ఆయా గాథల్లోని ముఖ్యమైన ఘట్టాలు. ఇప్పుడు భీష్మ వంతు వచ్చింది. ప్రమోషన్ మెటీరియల్ చూస్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలానే ఉన్నాయి. మరి వాటిని నిలబెట్టుకుని భీష్మ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తే అభిమానులకు అంతకన్నా కావలసింది ఏముంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి