iDreamPost

టాలీవుడ్ కి బిఎఫ్ 7 గుబులు – నిజంగా ప్రమాదమా

టాలీవుడ్ కి బిఎఫ్ 7 గుబులు – నిజంగా ప్రమాదమా

BF.7 coronavirus variant చైనాలో మళ్ళీ కరోనా మొదలవ్వడంతో మిగిలిన దేశాలు అప్రమత్తమవుతున్నాయి. అన్ని చోట్ల ఆంక్షలను పూర్తిగా సడలించేసిన మన దేశంలోనూ క్రమంగా నిబంధనలను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ చేసేంత సీన్ ప్రస్తుతానికి లేదు కానీ ఒకవేళ మహమ్మారి కనక కొంచెం తీవ్రంగా ఎంట్రీ ఇస్తే మాత్రం జనాలు ముందుగా తగ్గించేది సినిమాలు చూడటమే. థియేటర్లలో నాలుగు గోడల మధ్య ఏసీ గాలులు పీల్చుకుంటూ వైరస్ ని త్వరగా రప్పించుకునే అవకాశం తీసుకోరు. ఇప్పటికైతే నాలుగైదు కేసులు మినహా పెద్దగా నమోదు కాలేదని కేంద్రం చెబుతోంది. ఎయిర్ పోర్ట్స్ లాంటి ప్రదేశాల్లో మునుపటిలా పరీక్షలు తీసుకురాబోతున్నారు

టాలీవుడ్ గత ఏడాదిగా బాగా కోలుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు నమోదవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలు కెజిఎఫ్ 2 కాంతార విక్రమ్ లాంటి డబ్బింగ్ మూవీస్ భారీ వసూళ్లతో బయ్యర్లకు లాభాలనిచ్చాయి. ఫ్లాపులు ఉన్నప్పటికీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత కొనేందుకు ఓటిటిలు సుముఖంగా ఉండటంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే మాత్రం ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. అంతర్జాతీయ విశ్లేషకులు ఇండియాకు వచ్చిన ముప్పేమీ లేదని, చైనా తరహాలో ఇక్కడ ప్రమాదం ఉండదని భరోనా ఇస్తున్నారు. అదే నిజమైతే అంతకన్నా సంతోషించాల్సిన విషయం మరొకటి ఉండదు.

వచ్చే ఏడాది ప్రారంభం నుంచే భారీ విడుదలలు షెడ్యూల్ చేసుకుని ఉన్నాయి. మొదటి ఆరు నెలల కాలంలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, హరిహరవీరమల్లు, ఆది పురుష్ లాంటి భారీ చిత్రాలతో మొదలుకుని డీజే టిల్లుస్క్వేర్ లాంటి బడ్జెట్ సీక్వెల్స్ క్రేజీ అంచనాలతో వస్తున్నాయి. ఏ భయాలు లేకపోతేనే పబ్లిక్ థియేటర్లకు వస్తారు. కొత్త వేరియంట్ తీవ్రత గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాలి కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేం కానీ ఏదైనా అనుకోనిది ముంచుకొస్తే తల్లడిల్లేది సినీ పరిశ్రమే. బిఎఫ్ 7 పేరుతో పిలుస్తున్న కొత్త వెర్షన్ కరోనా మనజోలికి రాదనే డాక్టర్ల మాటే నిజమవ్వాలి. టాలీవుడ్ కే కాదు అన్ని రంగాలకు మంచిది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి