iDreamPost

అమ్మ ఒడిలో అదనంగా లబ్దిదారులు

అమ్మ ఒడిలో అదనంగా లబ్దిదారులు

విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తోంది. పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్న తల్లులకు ఆర్థికంగా ఆసరా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే అమ్మ ఒడికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2020 జనవరి 9న నేరుగా లబ్దిదారులకు రూ. 15వేలు చొప్పున ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది కూడా అదే తేదీన పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

గత ఏడాది ఈ పథకంలో 72లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం దక్కగా ఈసారి దానికి మించి అదనపు లబ్దిదారులు చేరబోతున్నారు. తాజాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం అమ్మ ఒడి పథకం ప్రాధమిక జాబితా ప్రకారం లబ్దిదారుల సంఖ్య 84 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా గుర్తించిన వారి సంఖ్య 83,72,254గా ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. విద్యార్థుల వివరాలను ఆన్ లైన్ లో విడుదల చేసినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

ఒకటో తరగతి నుంచి పన్నెండు వరకూ చదువుతున్న విద్యార్థులంతా ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం రాష్ట్రంలో 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధించి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి అర్హులుగా ఎంపికయ్యారని మంత్రి సురేశ్‌ తెలిపారు. తుది జాబితాను ఈనెల 30న ప్రకటిస్తామన్నారు. 61,317 పాఠశాలలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది జాబితా పారదర్శకంగా ప్రకటించినట్టు వెల్లడించారు. వచ్చే జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి నగదు జమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు.

అమ్మ ఒడి పథకానికి తగ ఏడాది అనూహ్య స్పందన వచ్చింది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన తీరు మీద అభినందనలు వెల్లువెత్తాయి. ఈసారి కూడా అదే తేదీన అమలుకి పూనుకోవడం ద్వారా ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుతోంది. అయితే అమ్మ ఒడి పథకం విజయవంతం అయిన విషయాన్ని గ్రహించిన విపక్ష టీడీపీ దాని మీద విష ప్రచారానికి పూనుకుంటున్నట్టు కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టారనే రీతిలో పచ్చ పత్రికల్లో కథనాలు రావడం దానికి నిదర్శనంగా భావిస్తున్నారు. గత ఏడాది కన్నా సుమారు 10లక్షల మంది పైబడి లబ్దిదారులకు మేలు జరుగుతుండగా ఆంక్షలు పెట్టి కోత కోస్తున్నారనే రీతిలో అర్థసత్యాల ప్రచారం విస్మయకరంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి