iDreamPost

తెలంగాణ బిజెపి నూతన రధసారధి గా బండి సంజయ్

తెలంగాణ బిజెపి నూతన రధసారధి గా బండి సంజయ్

తెలంగాణలో ఇటీవల కాలంలో రాజకీయంగా అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా ఉన్న కరీంనగర్ ఎంపీ, యువ నాయకుడు బండి సంజయ్ ని ఎట్టకేలకు బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తూ బిజెపి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుంది అనే అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో, గత కొంతకాలంగా రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. కేంద్రపరిశీలకులు అనిల్ జైన్, జయ్ పాండే లు రాష్ట్ర కార్యవర్గంతో ఇప్పటికే పలుమార్లు విస్తృత సంప్రదింపులు జరిపి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఎట్టకేలకు పార్టీ నూతన సారధి నీయామకంపై ఉత్కంటతకు తెరదించుతూ పార్టీ అధిష్టానం బండి సంజయ్ ని తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది.

ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు కె.లక్షణ్ నే మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగాయి. లక్ష్మణ్ తో పాటు ముఖ్య నేతలు మురళీధర రావు, డీకే అరుణ, విద్యాసాగర్ రావు, రామచందర్ రావు తదితరుల పేర్లు పరిశీలన లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అదేవిధంగా ఇటీవల కాలంలో చాలా చోట్ల పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలనే పార్టీ రాష్ట్రాధ్యక్షులుగా నియమిస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా బండి సంజయ్ కి లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు. విద్యార్థి దశ నుండే ఎబీవీపీ కార్యకర్తగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న బండి సంజయ్ కి బలమైన ఆర్ఎస్ఎస్ నేపధ్యం కూడా కలసివచ్చింది. అంతేకాక తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన “మున్నూరు కాపు” కు చెందిన నేత కావడం కూడా బండి సంజయ్ కి కలసి వచ్చిందని చెప్పవచ్చు.

ఆరెస్సెస్ స్టూడెంట్ వింగ్ ఎబీవీపీ, భారతీయ యువ మోర్చా( బిజెపి అనుబంధ విభాగం) లో చురుగ్గా పాల్గొన్న బండి సంజయ్ గతంలో అద్వానీ చేపట్టిన రథయాత్రలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆనంతరం ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన బండి సంజయ్ 2005 లో మొదటిసారి కరీంనగర్ లో 48 వార్డు నుండి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2014 లో ఒకసారి, 2018 లో మరోసారి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన బండి సంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆయన విజయం సాధించలేకపోయారు. అయితే ఆ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కరీంనగర్ ప్రజల్లో మంచి సానుభూతి పొందారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గా టీఆరెస్ సిట్టింగ్ ఎంపీ వినోద్ పై సంచలన విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఎంపీగా ఎన్నికైన తరువాత బండి సంజయ్ వివిధ అంశాలలో టీఆరెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి