iDreamPost

ఒకే కథ ఒకే రోజు బాలయ్య వెంకీ ఢీ – Nostalgia

ఒకే కథ ఒకే రోజు బాలయ్య వెంకీ ఢీ – Nostalgia

కొన్ని బాక్స్ ఆఫీస్ విచిత్రాలు చాలా గమ్మత్తుగా విచిత్రంగా అనిపిస్తాయి. కాలం ఎంత వేగంగా పరిగెత్తినా వీటి తాలూకు సంగతులు కొత్తగా అనిపిస్తూ ఆసక్తిని రేపుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. 1989వ సంవత్సరంలో జూన్ 29న ఒకే రోజు రెండు భారీ సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి బాలకృష్ణ హీరోగా రూపొందిన అశోక చక్రవర్తి. రెండు వెంకటేష్ హీరోగా వచ్చిన ధృవనక్షత్రం. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా. అసలు పాయింట్ వేరే ఉంది. రెండు కథలు ఇంచుమించు ఒకే లైన్ మీద సాగుతాయి. మధ్యతరగతికి చెందిన ఓ మాములు యువకుడు పరిస్థితుల ప్రభావం వల్ల పేరు మోసిన డాన్ గా ఎదిగే పాయింట్ మీద వీటిని తీశారు.

విచిత్రం ఏమిటంటే వీటికి రచయితలు పరుచూరి బ్రదర్సే. ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లేలో వ్యత్యాసం ఉన్నప్పటికీ థీమ్ మాత్రం కామన్ గానే అనిపిస్తుంది. రెండు సినిమాల్లోనూ చాలా సారూప్యతలు కనిపిస్తాయి. అశోక చక్రవర్తికి దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర కాగా ధృవ నక్షత్రంకి వై నాగేశ్వర్ రావు డైరెక్టర్. బాలయ్య సినిమా 70 ఎంఎం సినిమా స్కోప్ లో చాలా భారీగా తీశారు. ఇళయరాజా సంగీతం ముందే క్రేజ్ తెచ్చుకుంది. ధృవ నక్షత్రం 35 ఎంఎంలో లిమిటెడ్ బడ్జెట్ లో తీశారు. అప్పటికే కొంత మార్కెట్ తగ్గిన చక్రవర్తి మ్యూజిక్ ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ ఫలితానికి వస్తే ధృవ నక్షత్రం మంచి హిట్ మూవీగా నిలిచి హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుంది.

విపరీతమైన అంచనాల మధ్య అశోక చక్రవర్తి వాటిని అందుకోలేక ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. సురేష్ సంస్థ అండదండలు ధృవనక్షత్రంకు హెల్ప్ అయ్యాయి. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మాస్ హీరోగా బలమైన ముద్ర వేసి ముద్దుల మావయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలయ్యని మాఫియా డాన్ గా ప్రేక్షకులు చూడలేకపోయారు. అప్పుడప్పుడే సెటిలవుతున్న వెంకీకి అదే పాత్రకు మంచి ఎమోషన్స్ జోడించడంతో పాటు సెంటిమెంట్ దట్టించడంతో ధృవనక్షత్రం హిట్ అయ్యింది. ఇది కాకతాళీయంగా జరిగిందని పలు ఇంటర్వ్యూలలో దీని గురించి పరుచూరి వారు చెప్పారు కూడా. అందుకే అన్నది సినిమా విచిత్రాలు చాలా ఆసక్తిగా ఉంటాయని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి