iDreamPost

రూలర్ హిట్టవుతుందా… ?

రూలర్  హిట్టవుతుందా… ?

సినిమాకు ప్రాణం కథ.. ఆ కథ లేకుండా హీరో ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, గొంతు చించుకుని అరుస్తూ ఎన్ని డై’లాగు’లు చెప్పినా ఆ సినిమా నిలబడదు. కానీ బాలకృష్ణ తన సినిమాలకు కథ మినహా ఇవన్నీ కావాలని ముందుగానే ఫిక్స్ అయినట్లున్నాడు. అందుకే బాలయ్య నుండి రొటీన్ కథలున్న ముందే ఉహించగలిగే సినిమాలు తప్ప కొత్తదనం మచ్చుకైనా రావడం లేదు. ఇప్పటికే టీజర్లు ట్రైలర్లతో సినిమా ఉద్దేశ్యం తెలుగు ప్రేక్షకులకు ముందే తెలిసిపోయింది. కానీ ఏమైనా కొత్తగా అలరిస్తాడేమో అని ఆశగా వెళ్లిన ఆశావహులకు మాత్రం నేనేమి మారలేదు అని దిమ్మతిరిగేలా థియేటర్లో కొట్టాడు బాలయ్య బాబు.

రవికుమార్ ఒకప్పుడు అగ్రశ్రేణి దర్శకుడే కావొచ్చు కానీ కాలానికి అనుగుణంగా మారకుండా ఇప్పుడు కూడా మూస ధోరణి కథలతో సినిమాలు రూపొందిస్తే తన కెరీర్ కే ప్రమాదమన్న నిజాన్ని గుర్తించడంలేదు. ముందుగా ఉహించగలిగే కథలతో మూస ధోరణిలో సినిమాలు రూపొందిస్తే ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. జై సింహా మూవీలో బాలయ్యను భగ్న ప్రేమికుడిగా చూపించిన రవికుమార్ “రూలర్” లో మాత్రం పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా,పారిశ్రామిక వేత్తగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. కానీ దానికి తగిన కథను రాసుకోవడంలో విఫలమయ్యాడని పూర్తిగా చెప్పొచ్చు. వీరాభిమానులకు తప్ప వేరేవారికి నచ్చే అవకాశాలు రూలర్ కి లేవన్న టాక్ నడుస్తుండడంతో KS రవికుమార్ దర్శకత్వ ప్రతిభపై అనుమానాలు ఏర్పడుతున్నాయి.

బాలకృష్ణ టోనీ స్టార్క్ లా కనిపించడానికి తీసుకున్న శ్రద్ద కథపై కూడా పెట్టి ఉంటే సినిమాకి కొంచెమైనా పాజిటివ్ టాక్ వచ్చేది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నడిచినా పోలీస్ గెటప్ లో ఉన్న సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉండటం రూలర్ కి ప్రతికూలాంశం.ఇకనైనా బాలయ్య ఇలాంటి రొటీన్ కథలకు దూరంగా ఉండటం మంచిదేమో అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.సినిమాలో బాలకృష్ణ ఎనర్జీ మాత్రం ఓ రేంజ్ లో ఉండటంతో కొందరు అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించినా సినిమా హిట్ అవడానికి అవసరమైన కథ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అదెంత భారీ చిత్రమైనా సరే ప్రేక్షకుల తిరస్కారానికి గురి కావడం ఖాయం. కథ లేకుండా ఎన్ని సాముగరిడీలు చేసినా ప్రయోజనం ఉండదని బాలకృష్ణ గుర్తించి ఇకనైనా కాలం చెల్లిన, మూస ధోరణి కథలకు దూరంగా ఉంటే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి