iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 2 – ఈగోల మధ్య యుద్ధం

లాక్ డౌన్ రివ్యూ 2 – ఈగోల మధ్య యుద్ధం

ఈ ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించి తెలుగులోనూ రీమేక్ పరంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘అయ్యప్పనుం కోశియుమ్’. స్టార్ హీరో పృథ్విరాజ్, సీనియర్ నటుడు బిజూ మీనన్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్లు ఉండరు. ఇద్దరికీ భార్యలను చూపిస్తారు కానీ వాళ్ళు నామ్ కే వాస్తే. దీన్నే ఇక్కడ బాలకృష్ణ, రానాలతో తీసే ఆలోచన ఉన్నట్టు గత కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. అసలింతకీ ఈ సినిమాలో ఏముందో చూద్దాం.

కథ

చిన్న వయసులోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న హవల్దార్ కోషి కురియన్(పృథ్విరాజ్). ఓసారి మద్యం నిషేదించబడిన అడవి మార్గంలో వేరే మిత్రుల కోసం జీపులో డ్రైవర్ సహాయంతో పడుకుని వెళ్తూ ఉంటాడు. మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపుతారు. ఆ టైంలో అక్కడ డ్యూటీ చేస్తున్న అయ్యప్పన్ నాయర్(బిజూ మీనన్)తో కోషికి గొడవ పడుతుంది. దాంతో కోషిని స్టేషన్ కు తీసుకెళ్తాడు నాయర్.

అయితే కోషి చాలా తెలివిగా నటించి నాయర్ తో మందు బాటిల్ ఓపెన్ చేయించి దాన్ని రహస్యంగా వీడియో తీసి పెట్టుకుంటాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది కాబట్టి కోషికి కొద్దిరోజులు జైలు శిక్ష పడుతుంది. బయటికి వచ్చాక ఆ వీడియోని మీడియాకు పంపుతాడు కోషి. దీంతో నాయర్ సస్పెండ్ అవుతాడు. ఇద్దరి మధ్య బద్ద శత్రుత్వం మొదలవుతుంది. నాయర్ అప్పటిదాకా ఉన్న శాంత రూపాన్ని పక్కనబెట్టి ప్రతీకార చర్యలకు దిగుతాడు. తర్వాత ఈ ఇద్దరి గొడవ ఎక్కడిదాకా చేరిందనేదే మిగిలిన స్టోరీ

పెర్ఫార్మన్సులే బలం

దీనికి బలం పృథ్విరాజ్, బిజూ మీనన్ లే. అద్భుతమైన నటనతో రెండు పాత్రలకు జీవం పోశారు. నువ్వా నేనా అనే రీతిలో ఇద్దరి మధ్య సీన్స్ బాగా పండాయి. ఇతర ఆర్టిస్టులు ఉన్నప్పటికీ అందరిని సైడ్ లైన్ చేసి ఓ రేంజ్ ల్లో ఆటాడుకున్నారు ఇద్దరూ. ఏ ఒక్కరు బాలన్స్ తప్పినా తేడా వచ్చేది. నిజానికి మూడు గంటల సినిమా ఎక్కువ విసుగు రాకుండా చేసింది ఈ ఇద్దరే. అందరూ చాలా సహజంగా నటించడంతో సింగల్ లైన్ మీద సాగే స్టొరీ లైన్ మరీ ఎక్కువ బోర్ కొట్టకుండా సాగింది. కోషి నాన్నగా పలుకుబడి ఉన్న పెద్దమనిషిగా చేసిన రంజిత్ దాన్ని తన యాక్టింగ్ తో నిలబెట్టాడు. నాయర్ భార్యగా నటించిన గౌరీ నందా ఉన్న కొన్ని సన్నివేశాలలోనూ తన ఉనికిని చాటుకుంది. మిగిలినవాళ్ళు కూడా ఉన్నంతలో న్యాయం చేశారు

టీం గురించి

సచీ తీసుకున్న లైన్ చాలా చిన్నది. ఇంటరెస్టింగ్ గానూ ఉంది. కాకపోతే విపరీత మనస్తత్వం కలిగిన ఇద్దరి మధ్య ఈగోలను బేస్ గా తీసుకుని కథను అల్లడం బాగానే ఉంది కాని రెండు గంటల్లోపు చెప్పాల్సిన కథను మూడు గంటల దాకా సాగదీయడమే అంతు చిక్కదు. ఎంతసేపూ కోషి, నాయర్ లు తప్ప ఎక్కువసేపు తెరమీద ఎవరూ కనిపించరు. మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా తర్వాత ఇదే ప్రహసనంగా మారి బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ లో ఒకదశ దాటాక చెప్పడానికి కథ లేక ఏవేవో సీన్లతో నెట్టుకొచ్చాడు సచీ. అవి తగ్గించినా నష్టం ఉండేది కాదు. అయినా తనలో టెక్నీషియన్ మాత్రం ఆకట్టుకుంటాడు. కెమెరా వర్క్ తో తన అద్భుత నైపుణ్యాన్ని చూపించాడు సందీప్ ఎలమోన్. కేరళ అందాలను చూపించిన తీరు చాల బాగుంది. జేక్స్ బెజోయ్ సంగీతం కూడా ప్రాణం పోసింది. ఈ ఇద్దరూ సచి బలహీనతలను కాపాడారు.

మనకు వర్క్ అవుట్ అవుతుందా

చాలా మార్పులు చేసి మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఎంచుకున్న స్టార్లకు ధీటుగా కథను ఎక్స్ పాండ్ చేస్తే అయ్యప్పనుం కోశియుం రాంగ్ ఛాయస్ అనిపించుకోదు. అలా కాకుండా మక్కికి మక్కి తీస్తే టార్గెట్ చేసిన మాస్ కి ఇందులో అంతగా కనెక్ట్ అయ్యే అంశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నిరాశపరిచే ఛాన్స్ లేకపోలేదు . దానికి తోడు బాలయ్య లాంటి సీనియర్లను నిజంగా తీసుకుంటే చాలా అంశాలు పరిగణన లోకి తీసుకోవాలి. ఎందుకంటే అయ్యప్పనుం కోశియుంలో కేవలం సందర్భానుసారంగా వచ్చే పాటలు మాత్రమే ఉంటాయి. డ్యూయెట్లు, ఐటెం సాంగ్, హుషారిచ్చే ట్యూన్లు ఇవేవి ఉండవు. వాటికీ తెలుగులో కొంతవరకైనా ఆస్కారం కలిగించాల్సి ఉంటుంది. మరి ఈ మార్పులకు సిద్ధపడితే అయ్యప్పనుం కోశియుం స్టార్లతో సేఫ్ గేమ్ గానే నిలుస్తుంది. లేదంటే రిస్క్ తో ముందుకు వెళ్ళాలి. చూద్దాం ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి