iDreamPost

avatar 2 అంచనాల ఆకాశంలో అవతార్ 2

avatar 2 అంచనాల ఆకాశంలో అవతార్ 2

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ టీజర్ నిన్న విడుదలైంది. జేమ్స్ క్యామరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మీద అంచనాలు మాములుగా లేవు. డిసెంబర్ లో రాబోతున్న ఈ సీక్వెల్ కు సంబందించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. దీంతో కలిపి మొత్తం నాలుగు భాగాలు రాబోతున్న అవతార్ కోసమే తన జీవితాన్ని కేటాయించారు క్యామరూన్. ఆ తర్వాత ఇంకో సినిమా చేయగలరా అంటే వయసు కోణంలో చూస్తే కష్టమే అనిపిస్తుంది. సో ప్రపంచానికి అవతార్ యెక్క శక్తిని పలుసార్లు రుచి చూపించిన తర్వాత రిటైర్ అవుతారేమో

ఇక టీజర్ విషయానికి వస్తే గ్రాఫిక్స్ బాగున్నాయి కానీ మరీ మైండ్ బ్లోయింగ్ అనిపించాయా అంటే సగం తలే ఊపాల్సి ఉంటుంది. ఈసారి ఎమోషన్ కు పెద్ద పీఠ వేస్తున్న క్యామరూన్ కంటెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాత్రలు వాటి స్వభావాలు అన్నీ ఫస్ట్ పార్ట్ నే తలపిస్తున్నప్పటికీ కథాపరంగా ఎలాంటి మార్పులు చేశారన్నది కీలకంగా మారనుంది. ఇది కొనసాగింపు కాబట్టి స్టోరీ కంటిన్యూ చేసినట్టే కనిపిస్తోంది. ఈ స్క్రిప్ట్ మీదే 13 సంవత్సరాలు పని చేశారు జేమ్స్ క్యామరూన్. ఇంకే ఇతర ప్రోజెక్టుల గురించి ఆలోచించలేదు. స్పైడర్ మ్యాన్, జురాసిక్ పార్క్ లను మించి అవతార్ సిరీస్ నెవర్ ఎవర్ సెన్సేషన్ కావాలన్నది ఆయన లక్ష్యం

డిసెంబర్ 16న రిలీజవుతున్న అవతార్ ది వే అఫ్ వాటర్ తో పోటీ పడేందుకు ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరు. త్రిడి, ఐమ్యాక్స్ తో పాటు వివిధ వర్షన్లలో రాబోతున్న ఈ సినిమా మన దేశంలో అయిదు భాషల్లో రిలీజ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో వదలబోతున్నారు. ఈ లెక్కన బాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలు ఆ నెలలో చివరి రెండు వారాలు త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. తెరపై ఎన్నడూ చూడని ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రయాణం చేయించబోతున్న అవతార్ 2 వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లోనూ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకుల అంచనా. చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి