iDreamPost

మతసామరస్యం కోసం కమిటీలు

మతసామరస్యం కోసం కమిటీలు

రాష్టంలో గత కొద్దీ కాలంగా గుడుల మీద వరుస దాడులు,రాజకీయ ఆరోపణలు తెలిసినవే. ఈ దాడులను నిలువరించటానికి ఇప్పటికే అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వారి పట్ల కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. విగ్రహ ధ్వంసం ఘటనలపై లోతుగా దర్యాప్తు చేసి ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలని ఆదేశించారు. వాటి వెనుక ఎవరున్నా లెక్క చేయొద్దని, ఎవరినీ వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు. మళ్లీ అలాంటి నేరం చేయాలంటే భయపడేలా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మతసామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీకి సీఎస్ నేతృత్వం వహిస్తారు. జిల్లా కమిటీలు కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

మతసామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఉత్తర్వులు వెలువడటం మంచి పరిణామమని సీనియర్‌ బ్యూరోక్రాట్లు, మేధావులు, న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోనూ రాధాకృష్ణ అలియాస్ ఆర్కేకు చెందిన పత్రిక రాజకీయ కోణంలో విశ్లేషించడమే కాకుండా విషాన్ని చిమ్మింది. ప్రభుత్వ ఉత్తర్వులలో ‘పాలసీ పెరాలసిస్‌’ అనే పదాన్ని వాడారంటూ ఆ మీడియా గుంజుకుంది. ఇలాంటి పదాలను ఎవరూ వాడరని సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ కథనంపై సీనియర్‌ బ్యూరోక్రాట్లు, మేధావులు, న్యాయకోవిదులు మండిపడుతున్నారు. వాస్తవ పరిస్థితులను తెలియచేస్తూ తాము తీసుకుబోయే చర్యలను ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో స్పష్టంగా తెలిపిందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. భారీ ఆర్థిక లోటుతో ఏపీ అప్పులు ఊబిలో చిక్కుకుపోయిన సంగతి గుర్తు చేసుకోవాలని తెలిపారు. తాజాగా కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ లోనూ ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటని అర్ధమవుతుంటే ఆ జీవోలో తప్పులేదని అభిప్రాయపడ్డారు.

విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలపై ద్రుష్టి సారించకుండా హంగు, ఆర్భాటాలతో ఆ లోటును డబల్ చేసిన గత ప్రభుత్వ తీరును చెప్పడం తప్పు కాదని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజా ధనాన్ని వృధా చేసిన గత ప్రభుత్వ తీరును ‘పాలసీ పెరాలసిస్‌’ అని చెప్పడంలో తప్పులేదని స్పష్టం చేశారు. 2014-2019 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని తెలిపారు. ప్రభుత్వం మారిన తరువాత కరోనా లాంటి మహమ్మారి దాడితో రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. . ఇంతటి సంక్షోభంలోనూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ‘పేదలందరికీ ఇల్లు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ వాస్తవాలను ప్రభుత్వం ఉత్తర్వులలో తెలపడం తప్పుకాదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో బాటు ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుకుంటూ కోర్టులో కేసులు మీద కేసులు వేసిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. అది చాలక బరి తెగించి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను, ఆర్థికాభివృద్ధిని అడ్డుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం, హోంమంత్రి, డీజీపీ ముందు ప్రజాసేవకులని, ఆ తర్వాతే క్రైస్తవులని సీఎస్ చెప్పడం అక్షరాల నిజమని సీనియర్‌ బ్యూరోక్రాట్లు, మేధావులు, న్యాయకోవిదులు ప్రశంసించారు. ప్రజాసేవలో ఉన్నవారికి మతం ఆపాదించడం సమంజసం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు ఒక్కొక్కరు ఉండేలా నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకుండా నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీలను ఏర్పాటు చేయడం వాటిలో వాస్తవ పరిస్థితులను వివరించడం తప్పుకాదని ఎల్లో మీడియాకు హితువు పలికారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి