iDreamPost

అందరిని గెలిచిన అతనొక్కడే – Nostalgia

అందరిని గెలిచిన అతనొక్కడే – Nostalgia

స్టార్ హీరో ఫ్యామిలీ అనే స్టాంప్ ఉండగానే ప్రేక్షకులు రెడ్ కార్పెట్ వేయరు. బలమైన కంటెంట్ ఉన్న సినిమాతో తామేంటో ప్రూవ్ చేసుకోగలిగినప్పుడే అభిమానులు అక్కున చేర్చుకుంటారు. లేకపోతే తిరస్కారం తప్పదు. ఒకేరోజు తొమ్మిది సినిమాల ఓపెనింగ్ తో నందమూరి బ్రాండ్ మీద ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తారకరత్న ఎంత త్వరగా కనుమరుగవ్వాల్సి వచ్చిందో చూసాం. హరికృష్ణ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తొలిఅడుగులు సైతం అంత సులభంగా పడలేదు. 2003లో డెబ్యూ చేసిన ‘తొలిచూపులోనే’తో పాటు రెండో మూవీ ‘అభిమన్యు’ ఫ్లాప్ కావడంతో తన మీద రేగిన అనుమానాలే ఎక్కువ.

వీటి షూటింగ్ టైంలోనే దర్శకుడు సురేందర్ రెడ్డి అతనొక్కడే స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుని పలువురు నిర్మాతలకు వినిపించడం మొదలుపెట్టారు. టి ప్రభాకర్, క్రాంతి కుమార్ లాంటి సీనియర్ల వద్ద పనిచేసిన అనుభవం ఆయనకు ఓ స్థిరమైన నమ్మకాన్ని కలిగించింది. అతనొక్కడేని నిర్మిస్తానని తొలుత ముందుకు వచ్చిన ఓ ప్రొడ్యూసర్ తీరా కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు దెబ్బ తినేసరికి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో అతనొక్కడే కథ విపరీతంగా నచ్చిన కళ్యాణ్ రామ్ తనే స్వంతంగా నిర్మించేందుకు సిద్ధపడ్డాడు. ఇదంతా జరగడానికి ఏడాదిన్నర పట్టింది. యాక్షన్ డ్రామా కావడంతో బడ్జెట్ కూడా భారీగా డిమాండ్ చేసింది.

2004 నవంబర్ 15న షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘అతనొక్కడేని’ అనుకున్న టైంలోనే సురేందర్ రెడ్డి వేగంగా పూర్తి చేశారు. సింధు తులాని హీరోయిన్ గా ఆశిష్ విద్యార్ధి మెయిన్ విలన్ గా మణిశర్మ సంగీత దర్శకుడిగా సూరి సెట్ చేసుకున్న టీమ్ పర్ఫెక్ట్ గా అవుట్ ఫుట్ ఇచ్చింది. వినడానికి ఇదో రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా అనిపించినప్పటికీ చాలా స్టైలిష్ ట్రీట్మెంట్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తీరు ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా రఘుబాబుని చంపే ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకరకంగా షాక్ ఇచ్చాయని చెప్పాలి. 2005 మే 7 రిలీజైన అతనొక్కడే కేవలం వారం గ్యాప్ తో వచ్చిన రవితేజ ‘భద్ర’ కాంపిటీషన్ ని తట్టుకుని మరీ సూపర్ హిట్ కొట్టింది. సురేందర్ రెడ్డికి మొదటి సినిమాతోనే గొప్ప గుర్తింపు ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి