iDreamPost

పాతిక సంవత్సరాల ఆసియా కప్

పాతిక సంవత్సరాల ఆసియా కప్

ఏప్రిల్ 14,1995,షార్జా

ఆసియా కప్-1995 క్రికెట్ అభిమానుల హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.ఇండియా-పాక్‌ల మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో 1993లో జరగాల్సిన ఆసియా కప్ రద్దయింది.దీంతో ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆసియా కప్ జరుగుతుండడంతో అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్,పాకిస్థాన్,శ్రీలంక మూడు జట్లు రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి సమవుజ్జీగా నిలిచాయి. కానీ మెరుగైన రన్ రేట్‌తో ఫైనల్ పోరుకు భారత్-శ్రీలంక అర్హత సంపాదించాయి. వాస్తవానికి పాకిస్థాన్‌ను దురదృష్టం వెంటాడటంతో కేవలం 0.105 రన్ రేట్‌ తేడాతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది.

ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లంక ఓపెనర్లు రోషన్ మహానామా,సనత్ జయసూర్య తొలి 10 ఓవర్‌లలో 46 పరుగులు చేశారు.కానీ అదే స్కోరు వద్ద ఐదు బంతుల వ్యవధిలో శ్రీలంక ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అసంకా గురుసిన్హా నిలకడగా పరుగులు సాధిస్తున్న మిగతా బ్యాట్స్‌మెన్‌ల నుంచి అతనికి సహకారం లభించలేదు.20 ఓవర్లు ముగిసిన వెంటనే అరవింద్ డిసిల్వా(13) వెంకటేష్ ప్రసాద్ బౌలింగులో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

స్కోర్ బోర్డుకు మరో 8 పరుగులు జత చేసి 89 వద్ద కెప్టన్ రణతుంగ రనౌట్ అయ్యాడు.దీంతో 89 పరుగులకే నలుగురు కీలక బ్యాట్స్‌మెన్‌ వికెట్‌లను కోల్పోయి కష్టాలలో పడింది.ఒక ఎండ్‌లో వికెట్లు పడిపోతున్నా ఒంటరి పోరాటం చేసిన అసంకా గురుసిన్హా 122 బంతులలో 2 ఫోర్లు,3 సిక్సర్లతో 85 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.చివరలో కల్పగే,వాసు జోడి జట్టు స్కోరుకు 12 పరుగులు జత చేయడంతో నిర్ణీత 50 ఓవర్‌లలో శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించింది.

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రభాకర్(9) ను తొలి వికెట్‌గా 48 పరుగుల వద్ద కోల్పోయింది.మరో 10 పరుగుల తర్వాత రమణనాయకే బౌలింగ్‌లో ఐదు ఫోర్లతో 41 పరుగులు చేసిన మరో ఓపెనర్ టెండూల్కర్ వెనుదిరిగాడు.అప్పటికి భారత్ తరపున స్కోర్ బోర్డుపై రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు మాత్రమే కలవు.కానీ కీలకదశలో సిద్దూతో జతకలిసిన కెప్టెన్ అజారుద్దీన్ శ్రీలంక బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు దూకుడు ప్రదర్శిస్తూ లంక బౌలర్లపై ఎదురుదాడి చేశారు.ఈ క్రమంలో మూడో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సులభంగా లక్ష్యాన్ని ఛేదించారు.వీరి అజేయ బ్యాటింగ్ ప్రదర్శనతో 49 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది.

అంతిమ పోరులో లంకేయులపై నెగ్గిన భారత్ నాలుగోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. టీమిండియా ఆసియా టైటిల్‌ను వరుసగా మూడుసార్లు గెలుపొందడం విశేషం.

జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన నాటి భారత సారధి అజారుద్దీన్ అజేయంగా 89బంతులలో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ” ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచాడు.కాగా భారత్‌ను విజయతీరాలకు చేర్చిన సిద్దూ నాటౌట్‌గా 106 బంతులలో ఐదు ఫోర్లతో 84 పరుగులు చేశాడు. టోర్నీ మొదటి నుండి అద్భుత బ్యాటింగ్ ప్రతిభ కనపరుస్తూ నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన సిద్దూ “ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ”గా ఎంపికయ్యాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి