iDreamPost

ఆర్టిస్టు చంద్ర మరణం, పలువురు ప్రముఖుల నివాళులు

ఆర్టిస్టు చంద్ర మరణం, పలువురు ప్రముఖుల నివాళులు

ఆర్టిస్టు చంద్ర గా గుర్తింపు పొందిన కళాకారుడు కన్నుమూశారు. కరోనా కారణంగా వృద్ధాప్యం కూడా తోడయిన చంద్ర మరణం అనేక మందిని విషాదంలో నింపింది. తెలుగు పత్రికా రంగంలో కొన్ని దశాబ్దాల ఆటు పదునైన కార్టూన్లతో ఆయన చిరపరిచితుడయ్యారు. 1946 ఆగ్టసు 28న వరంగల్ లో జన్మించిన ఆయన ఆంధ్ర, తెలంగాణాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో సామాజిక స్పృహ కలిగిన అనేక మందిని అన్ని విధాలా ప్రోత్సహించారు. పలువురికి చేదోడుగా నిలిచారు.

‘‘అందగాడు చంద్ర, అందమైన గీత, ముచ్చటైన రంగులు, తనదంటూ ఒక శైలి. ఇతడి కార్టూన్లు నవ్వించును. తప్పక నేడే చంద్రను వాడగలరు’’ అంటూ మరో ఆర్టిస్ట్ మోహన్ ఆయన గురించి చేసిన వ్యాఖ్యానం గమనిస్తే చంద్రం ప్రాధాన్యత అర్థమవుతుంది. సుమారు నలభై ఏళ్ల పాటు కొ్ని వేల కథలకు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్లు, రంగుల్లో బొమ్మలు, మరికొన్ని వేల పుస్తకాలకు అట్ట మీద బొమ్మలు, కార్టూన్లు వేసిన చంద్రం తెలుగు వారందరినీ ఆకట్టుకున్నారు. పెయింటిగ్ లు, గ్రీటింగ్ కార్డులు తో పాటుగా కథలు రాయడం. సినిమాలు, టీవీ రంగంలో కూడా చంద్రం తనదైన గుర్తింపు సాధించారు.

చంద్ర గీతని అర్థం చేసుకున్న అనేక మంది యువతరం నేటికీ ఇలస్ట్రేటర్లుగా, కార్టూనిస్టులుగా పత్రికల్లో స్థిరపడుతున్న తీరు ఆశ్చర్యం వేస్తుంది. అరవయ్యవ దశకాంతం ప్రపంచాన్ని విప్లవాలు కుదిపేశాయి. అమెరికా, యూరప్ లలో యుద్ధానికి వ్యతిరేకంగా వెల్లువైన ఉద్యమం కొత్త పోస్టర్లనీ, పెయింటింగ్ లనీ పుట్టించింది. తెలుగునాట కూడా ఈ మార్పులు రాజకీయాల్లో కొంత కనిపించినా, కళారంగం మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. పత్రికల్లో సాంప్రదాయిక పద్ధతి నుంచి బాపూ తెచ్చిన పెద్ద బ్రేక్ ఒక ధోరణిగా స్థిరపడింది. దాని ప్రభావం నుండి వచ్చి ఇది మా స్టైల్ అని అప్పుడు చూపించిన వాళ్లలో చంద్ర ముందుంటాడు. 70వ దశకంలో కూడా వచ్చి తెలుగు హ్యూమర్ కార్టూన్ లకి సింబల్స్ అయ్యాయి. వాటి మధ్య నుంచే చంద్ర వచ్చాడు. ఆ వరసలో చంద్ర కార్టూన్లూ ముందుకు వచ్చాయి. క్రమంగా కార్టూన్ ని, ఐడియాను ప్రజెంట్ చేయడంలోనే పెద్ద బ్రేక్ తెచ్చాడు. తూర్పు యూరప్ లో, అమెరికాలో మెయిన్ స్ట్రీమ్ కార్టూన్లు కాకుండా చాలా స్టైలైజ్జ్ గా ఉండే కార్టూన్ల విజువలైజేషన్ కూ సమాంతర ధోరణిని ప్రవేశపెట్టాడు. ఇలాంటి ధోరణిని చంద్ర తర్వాతి తరం కార్టూనిస్టులు కూడా అందులేకపోయారు.

చంద్ర ఇలాంటి కార్టూన్లు గీసి చాలా సంవత్సరాలైనా సరే మన కార్టూనిస్టులెవరూ ఆయన స్థాయిని అందిపుచ్చుకోలేకపోయారనే వాదన కూడా ఉంది. చాలా సంవత్సరాల ముందే తెలుగు కార్టూన్ భాషని చంద్ర మార్చాడు. కొత్త సింబల్స్, కొత్త పదాల్ని ఇండియన్ ఇంకులో ముంచి వెలిగించారు. అందుకే కార్టూనిస్టుల లోకంలో చంద్ర వన్నెతగ్గని యోధుడిగా గుర్తింపు పొందారు. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజల పక్షాన కార్టూన్లు ఝుళిపించిన చంద్ర కన్నుమూయడం పట్ల పలువురు సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

Also Read : ముఖేశ్ అంబానీ కుడిభుజం.. మనశ్శాంతి కోసం సన్యాసం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి