iDreamPost

అర్న‌బ్ వివాదంలో త‌ల‌దూర్చి బాబు రూటు మార్చేశాడు..!

అర్న‌బ్ వివాదంలో త‌ల‌దూర్చి బాబు రూటు మార్చేశాడు..!

చంద్ర‌బాబు రాజ‌కీయాలు ఎప్పుడె ఎలా ఉంటాయో ఎవ‌రూ చెప్ప‌లేరు. నిర్ణయాలు తీసుకోవ‌డంలో తీవ్ర జాప్యం చేస్తార‌నే పేరున్న చంద్ర‌బాబు, అభిప్రాయాలు మార్చుకోవ‌డంలో ముందుంటారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు యూట‌ర్న్ లు తీసుకోవ‌డంతో చివ‌ర‌కు న‌రేంద్ర‌మోడీ ఏకంగా పార్ల‌మెంట్ లోనే యూ ట‌ర్న్ బాబు అని ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా బాబు తీరు మార‌లేదు. తాజాగా అర్న‌బ్ గోస్వామి ఎపిసోడ్ లో బాబు తీరు చూస్తుంటే మ‌ళ్లీ మ‌న‌సు మార్చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అర్న‌బ్ గోస్వామికి ఆర్ఎస్ఎస్ , బీజేపీ శ్రేణులు సంపూర్ణంగా మ‌ద్ధ‌తు ఇస్తున్నారు. మోడీ అనుచ‌రులంతా అర్న‌బ్ వెంట ఉన్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మీద వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో వివాదం మొద‌ల‌య్యింది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, కాంగ్ర‌స్ తో క‌లిసి సాగుతూ మోడీ మీద చేసిన వ్యాఖ్య‌లు అంద‌రికీ తెలిసిందే. కానీ తాజా వివాదంలో చంద్ర‌బాబు ఎంత‌గానో పొగిడిన సోనియాకి, ఆయ‌న తెగిడిన మోడీ మిత్రుడికి మ‌ధ్య జ‌ర‌గ‌డంతో స‌హజంగా చంద్ర‌బాబు మౌనం వ‌హించినా అడిగే వారు ఉండ‌రు.

కానీ అనూహ్యంగా సోనియా మీద విమ‌ర్శ‌లు గుప్పించిన అర్న‌బ్ కి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ కూడా మ‌ద్ధ‌తు ప‌లికారు. ఇద్ద‌రూ ట్విట్ట‌ర్ లో త‌మ మ‌ద్ధ‌తు అర్న‌బ్ కి తెలిపారు. అర్న‌బ్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ అది మొత్తం పాత్రికేయుల‌పై జ‌రిగిన దాడిగా అభివ‌ర్ణించారు. దాంతో సోనియాను వ్య‌తిరేకిస్తున్న క్యాంప్ ని సంతృప్తి ప‌రిచే ప‌ని చేసిన‌ట్టుగా స్ప‌ష్ట‌మవుతోంది. ఇప్ప‌టికే అన్ని సంద‌ర్భాల్లో కూడా మోడీని ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నారు. ఇటీవ‌ల ప్ర‌తీ అవ‌కాశాన్ని కూడా వాడుకునే య‌త్నంలో ఉన్నారు. అదే సమ‌యంలో పీఎంఓకి ఫోన్ చేసి తాను కోరిన త‌ర్వాత త‌న‌కు పీఎం ఫోన్ చేశారంటూ కూడా గొప్ప‌గా చెప్పుకున్న అనుభ‌వం చంద్ర‌బాబుది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ బీజేపీతో బంధం కోసం త‌హ‌త‌హలాడుతున్న చంద్ర‌బాబు అదే ప్ర‌య‌త్నంలో అర్న‌బ్ ఎపిసోడ్ లో త‌ల‌దూర్చారా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

చంద్ర‌బాబు ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నా మోడీ వైపు నుంచి ఆశించిన ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చంద్ర‌బాబు పుట్టిన రోజు నాడు క‌నీసం శుభాకాంక్ష‌లు కూడా ట్విట్ట‌ర్ లో నితిన్ గ‌డ్క‌రీ త‌ప్ప మోడీ వైపు నుంచి క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో తాజాగా సోనియా గాంధీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన అర్న‌బ్ కి అండ‌గా ఉంటామ‌న్న‌ట్టుగా చంద్ర‌బాబు పంపించిన సంకేతాలు విప‌క్ష నేత‌ల‌కు మింగుడుప‌డే అవ‌కాశం లేదు. దాంతో బాబుకి వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్కుతుందా లేదా అన్న‌ది సందేహంగానే చెప్ప‌వ‌చ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి