iDreamPost

నలువైపులా విమర్శలు.. !

నలువైపులా విమర్శలు.. !

తన మాటే చెల్లుబాటవ్వాలనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రకటించడం, మరో వైపు నిన్న మొన్నటి వరకు నిమ్మగడ్డకు అండగా ఉన్న రాజకీయ పార్టీలు ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండడంతో నిమ్మగడ్డ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల బృందంతో చర్చలు జరిపిన అనంతరం కోర్టు ఆదేశాలకు భిన్నంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవడంతో నలువైపుల నుంచి ఆయనపై ఒత్తిడి వస్తోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుండడం, మరో వైపు వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధత వల్ల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న ఎస్‌ఈసీకి స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని నిమ్మగడ్డకు తెలిసినా.. షెడ్యూల్‌ విడుదల చేసి కయ్యానికి కాలు దువ్వారు. అయితే ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు షాక్‌ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తమ అభిప్రాయాలను తీసుకోకుండా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఎస్‌ఈసీకి సహకరించబోమని ఏకగీవ్ర తీర్మానాలు చేయడంతో నిమ్మగడ్డ ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి తయారైంది.

మరో వైపు నిమ్మగడ్డకు, ఆయన తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ వస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు నిమ్మగడ్డ చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి. పైగా.. అక్రమాలు జరిగాయంటూ.. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఏం నిర్ణయం తీసుకున్నారో డిమాండ్‌ చేస్తుండడంతో నిమ్మగడ్డ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు.. ఎన్నికలకు సిద్ధమని ప్రకటిస్తూనే.. అదే సమయంలో నిమ్మగడ్డ వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఆయన వ్యవహార శైలి ఏకపక్షంగా ఉందని, చిత్తశుద్దిపై అనుమానాలు ఉన్నాయని మాట్లాడడంతో.. నిమ్మగడ్డ తికమకపడాల్సిన పరిస్థితి నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి