iDreamPost

వైఎస్‌ జగన్‌ సంకల్పం.. ఏపీ దశను మార్చబోతోందా..?

వైఎస్‌ జగన్‌ సంకల్పం.. ఏపీ దశను మార్చబోతోందా..?

భవిష్యత్‌ను అంచనా వేసి అందుకు అనుగుణంగా వర్తమానంలో పని చేసే పాలకుల వల్ల ఆ దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి నాయకులు స్వతంత్ర భారతంలో బహు అరుదుగా కనిపిస్తారు. సామ్యవాదాన్ని అనుసరించాలని, ఆ పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చినా.. ఆ తర్వాత పాలకులు ఆ దిశగా కాకుండా పెట్టుబడిదారీ విధానం వైపు వేగంగా అడుగులు వేశారు. దీంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి, ప్రైవేటు, కార్పొరేట్‌ రాజ్యం మొదలైంది. దీని వల్ల ప్రజల జీవన వ్యయాలు పెరిగి. ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.

1991 పారిశ్రామిక విధానం తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం అయ్యాయి. ప్రభుత్వమే నిర్వహించే కొన్ని రంగాలు క్రమంగా కార్పొరేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. రాజ్యాగం లక్ష్యాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, పాలకుల తీరు ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మాత్రం వ్యపారరంగంలో మళ్లీ పూర్వస్థితికి వెళ్లాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైఎస్‌ జగన్‌ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తోంది. తాజాగా మరో బొగ్గు గనిని ఏపీఎండీసీ వేలంలో సొంతం చేసుకుంది.

కేంద్ర ఉక్కుశాఖకు చెందిన మెటల్‌ స్క్రాప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఝార్ఖండ్‌ రాష్ట్రం గిరిడి జిల్లాలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు బ్లాక్‌ను ఏపీఎండీసీ వేలంలో దక్కించుకుంది. 105 హెక్టార్లలో ఉన్న ఈ బ్లాక్‌లో 2.215 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఉక్కు పరిశ్రమల్లో వినియోగించే నాణ్యమైన బొగ్గు ఇక్కడ లభిస్తుంది. దీంతో భవిష్యత్‌ అవసరాల నిమిత్తం ఈ బొగ్గు గనిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీఎండీసీని రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉంది. దీనితోపాటు నూతనంగా కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొద్ది కాలంలోనే కడప ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభం కాబోతోంది.

ప్రస్తుతం ఉక్కు పరిశ్రమలకు అవసరమయ్యే బొగ్గు లభ్యత స్వదేశంలో తక్కువగా ఉంది. విదేశాల నుంచే వివిధ రాష్ట్రాలలోని ఉక్కు పరిశ్రమలు బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉక్కు కర్మాగారాల్లో ఉపయోగించే బొగ్గు ఏపీఎండీసీ తాజాగా దక్కించుకుని బహ్మదిహ బొగ్గు గనిలో లభిస్తుంది. ఏపీలోని విశాఖ, త్వరలో ప్రారంభమయ్యే కడప స్టీల్‌ ప్లాంట్‌లకు అవసరమయ్యే బొగ్గును ప్రభుత్వమే బ్రహ్మదిహ బొగ్గు గని నుంచి సరఫరా చేసే వీలు ఏర్పడింది. ఈ బొగ్గు గని నిర్వహణ వల్ల ఏపీ ప్రభుత్వానికి ప్రతి ఏటా 25 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బొగ్గు గనులను నిర్వహించడం వల్ల ఏపీ ప్రభుత్వానికి బహులప్రయోజనాలున్నాయి. రాష్ట్రంలోని ఉక్కు పరిశ్రమలకు బొగ్గును సరఫరా చేయడంతోపాటు.. బొగ్గు విక్రయం వల్ల ఆదాయం కూడా సమకూరనుంది. వినూత్నమైన సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పెంచుతోంది. అదే సమయంలో అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భవిష్యత్‌లో పన్నులను పెంచాల్సిన పరిస్థితి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల ప్రజలపై భారం పడే ప్రమాదం నెలకొంది. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వమే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

గతంలో ప్రభుత్వ ఆదీనంలో ఉన్న అనేక సంస్థలు నాటి పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్ల నష్టాల్లో కూరుకుపోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి, లాభాల్లో నడిచేలా నిర్ణయాలు తీసుకుంటూ.. మరో వైపు నూతనంగా కొత్త సంస్థలు, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తిరిగి మళ్లీ 1991 ముందు ఉన్న మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అనేక పరిశ్రమలు, సంస్థలు ఉండే పరిస్థితి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయాల వల్ల కలిగే అవకాశం కన్పిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి