iDreamPost

ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు నిలిపివేయండి.. నిమ్మగడ్డ ఆదేశాలు..

ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు నిలిపివేయండి.. నిమ్మగడ్డ ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వివాదాస్పదంగా మారేలా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పనితీరుతో వివాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పోటీ లో ఉంటే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. విత్‌డ్రాలు, నామినేషన్లు చెల్లకపోవడం వంటి కారణాలతో 3249 పంచాయతీలకు గాను 523 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అయితే చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు జిల్లాలో ఏకగ్రీవమైన వాటిని పెండింగ్‌లో పెట్టాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలో ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయనే కారణాన్ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చూపుతున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవాలను పెడింగ్‌లో పెట్టాలని ఆదేశించి.. కొత్త వివాదానికి తెర లేపారు.

తొలి విడతలో 12 జిల్లాలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 523 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 321 పంచాయతీలకు గాను 39, విశాఖలో 340కి 44, తూర్పుగోదావరిలో 366కి 30, పశ్చిమ గోదావరిలో 239కి 41, కృష్ణాలో 234కి 23, గుంటూరులో 337కి 67, ప్రకాశంలో 227కి 35, నెల్లూరులో 163కి 25, చిత్తూరులో 454కి 110, కడపలో 206కి 51, కర్నూలులో 193కి 52, అనంతపురం జిల్లాలో 169 పంచాయతీలకు గాను 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అనేక వివాదాల నడుము పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ప్రక్రియ సాగుతున్న తరుణంలోనూ వివాదాలు కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు సర్వసాధారణం. కానీ ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యాంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం, వాటిని పెండింగ్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఏకగ్రీవాలు కావడం వెనుక ఏమైనా బలవంతాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే పోటీదారులు, స్థానికులు రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. ఆ ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలాంటిదేమీ లేకుండానే ఎన్నికల కమిషన్‌ కలుగజేసుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి