iDreamPost

పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. 9 మంది మృతి!

పంచాయతీ ఎన్నికల్లో  చెలరేగిన హింస.. 9 మంది మృతి!

సాధారణంగా ఎన్నికలు అనగానే గొడవలు, కొట్లాటలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఎన్నికల గొడవలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. జులై 8వ  తేదీ ఉదయం ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తెగబడ్డాయి.  అధికార టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలు తమ బలం ఉన్న చోట ప్రతాపం చూపించారు. గన్లు, కత్తులు, రాడ్లతో పోలింగ్ బూతులపై తెగబడ్డారు. ఈ  హింసాత్మక ఘటనల్లో  9 మంది మృతి చెందారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు.

శనివారం ఉదయం పశ్చిమబెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.  పొలింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. కూచ్ బెహార్ లోని ఫాలిమారీలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ను కాల్చిచంపడం జరిగింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు, ఆ తర్వాత  వివిధ పార్టీలకు చెందిన మరో నలుగురు కార్యకర్తలను కాల్చిచంపడంతో పంచాయతీ ఎన్నికల రోజున పెద్ద ఎత్తున హింస చెలరేగేగింది. రోడ్లపై తుపాకులతో వివిధ పార్టీల కార్యకర్తలు స్వైర విహారం చేశారు. కోట్లాటలు, దొమ్మీలు తమకు  అతి సహజం అన్నట్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కనిపించింది.

కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతులోకి చొరబడి ఏకంగా బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో  బ్యాలెట్ పేపర్ ను చించడం, తగల బెట్టడం చేశారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ఇళ్లపై దాడులు చేశారు. వాళ్ల ఆస్తులకు, ఇళ్లకు నిప్పు పెట్టారు. అలానే రోడ్లపై వాహనాలు దగలబెట్టి రణరంగ తలపించేలా చేశారు. ఇలా అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా రాష్ట్రమంతా రావణ కాష్టంలా మారిపోయింది. పంచాయతీ ఎన్నికల వేళ మూడు గంటల్లో జరిగిన తొమ్మిది హత్యల్లో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

భద్రతకు సంబంధించిన కేంద్ర బలగాల భారీ వైఫల్యం వల్లే ఈ తరహా ఘటనలు, హింసలు చోటు చేసుకున్నాయని అధికార పార్టీ టీఎంసీ ఆరోపించింది. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 73,887 స్థానాలకగాను ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైందని, 5.67 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని,అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారని అధికారులు తెలిపారు. బెంగాల్ లో జరిగిన హింసాకాండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి