iDreamPost

ఆగిన చోట నుంచే స్థానిక పోరు.. సుప్రింలో ఎన్నికల సంఘం వాదనతో సుష్పష్టం

ఆగిన చోట నుంచే స్థానిక పోరు.. సుప్రింలో ఎన్నికల సంఘం వాదనతో సుష్పష్టం

ఈ ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అర్థంతరంగా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను 45 రోజులపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత వైరస్‌ విజృంభించి.. ప్రస్తుతం కొనసాగుతుండడంతో ఎన్నికల నిర్వహణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్యలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్‌కు ఎన్నికల వాయిదాపై వివాదం చెలరేగింది. ఎన్నికల సంస్కరణలలో భాగంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవి పోయింది. అయితే కోర్టులో పిటిషన్లు వేసి పోయిన పదవిని నిమ్మగడ్డ మళ్లీ తెచ్చుకున్నారు.

ఎన్నికలు వాయిదా పడినప్పుటి నుంచి రాష్ట్రంలో ఓ చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియను రద్దు చేస్తారు. మళ్లీ కొత్తగా షెడ్యూల్‌ విడుదల చేస్తారని గ్రామ స్థాయిలోని నేతలు, కార్యకర్తల్లో జోరుగా చర్చసాగుతోంది. అధికార వైసీపీ, సీపీఎం మినహా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ పార్టీలు మళ్లీ ఎన్నికలను ఆది నుంచి ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కొత్తగా షెడ్యూల్‌ విడుదల చేయాలని ఎస్‌ఈసీకి తమ అభిప్రాయాన్ని తెలిపాయి.

అయితే వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఎన్నికలను వాయిదా వేశామని సుప్రిం కోర్టుకు తెలిపింది. నిరవధిక వాయిదా వేయలేదు. రద్దు చే యలేదని పేర్కొంది. ఎన్నికలు వాయిదా పడిన సమయంలో అభివృద్ధి పనులకు ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలని మార్చిలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని ఏపీ ప్రభుత్వం సుప్రింలో వేసిన పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణలో ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది పరమేశ్వర్‌.. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు పై విధంగా బదులిచ్చారు.

ఈ పరిణామంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో జరుగుతున్న చర్చ తెరపడినట్లే. స్వయంగా ఎన్నికల కమిషనే.. ఎన్నికలను రద్దు చేయలేదు. వాయిదా వేశామని చెప్పడంతో ఈ విషయం మరో ప్రశ్నకు ఆస్కారం లేదు. ఎన్నికల ప్రక్రియ తిరిగి ఎప్పుడు ప్రారంభం అయినా.. ఆగిన చోట నుంచే ప్రారంభం కానుంది.

తాజా పరిణామం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని విషయమని చెప్పవచ్చు. ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి.. రీ షెడ్యూల్‌ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తాజాగా ఏపీ అధ్యక్షుడుగా ఎన్నికయిన అచ్చెం నాయుడు వరకూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదంటూ చెబుతూ.. మళ్లీ ప్రారంభం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్‌ను స్వయంగా ఎన్నికల కమిషనే.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో వినిపించిన వాదనలతో తోచిపుచ్చినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి