iDreamPost

ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

తొలి విడత పంచాయతీల పోలింగ్‌కు మరో గంటలు సమయం ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవమైన పంచాయతీలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయన్న కారణంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ డిక్లరేషన్‌ ప్రకటించొద్దని రిటర్నింగ్‌ అధికారులకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లను ఆయా పంచాయతీలపై సమగ్ర నివేదిక కోరారు. దీంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన 177 పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇచ్చే ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ అంశంపై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లక డిక్లరేషన్‌ ఇవ్వాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. తొలి విడతలో విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 525 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీల డిక్లరేషన్‌ను తాత్కాలికంగా ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి నిమ్మగడ్డపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతోనూ మాట్లాడనీయోద్దంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఇంతటి వివాదానికి కారణమైంది. తాజాగా దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టేలా ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ పచ్చజెండా ఊపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి