iDreamPost

తెలంగాణకే కాదు ఏపీకి త్వరలో ఆ సౌలభ్యం

తెలంగాణకే కాదు ఏపీకి త్వరలో ఆ సౌలభ్యం

కరోనా వైరస్ ను అరికట్టడంలో మొదటి అడుగు గరిష్టంగా పరీక్షలు చేయడం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు దేశంలోనే ముందు వరుసలో ఉంది. కరోనా వైరస్ ప్రారంభ సమయంలో రాష్ట్రంలో తిరుపతి లో ఒక్క వైరాలజీ ల్యాబ్ మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 10 కి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో మరో రెండు ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న ప్రతి జిల్లాలోనూ ల్యాబ్ ఉండే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకి ఏడు వేల వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. కేవలం నెలరోజుల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన ఈ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం సమకూర్చుకోవడం విశేషం.

గరిష్ట స్థాయిలో వైరాలజీ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్న ఏపీ సర్కారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో మొబైల్ వైరాలజీ ల్యాబ్ ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దేశంలో ఇప్పటి వరకు మొబైల్ వైరాలజీ ల్యాబ్ సౌకర్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. డిఆర్డిఓ, ఈఎస్ఐ ఆస్పత్రి, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను అభివృద్ధి చేశాయి. ఇటీవల ఆ ల్యాబ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు ఏపీ సర్కార్ ఆ తరహా ల్యాబ్ ను ఏర్పాటు చేస్తోంది. డిఆర్డిఓ, స్విమ్స్ సంయుక్తంగా ఈ ల్యాబ్ రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొబైల్ వైరాలజీ ఏర్పాటుకు కోటి రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీలైనంత త్వరగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి