iDreamPost

ఖాళీగా ఉన్నోళ్ళంతా కలిసేందుకేనా..!

ఖాళీగా ఉన్నోళ్ళంతా కలిసేందుకేనా..!

ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న స్టేట్‌మెంట్లు, ఇప్పటి వరకు స్నేహం కొనసాగించిన వారిపై వేస్తున్న సెటైర్లనే నిదర్శనంగా చూపిస్తున్నారు. అధికారం చేపట్టి వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనీలో బిజీబిజీగానే ఉంది. కేంద్రంలో ఉన్న అధికారంతో రాష్ట్ర బీజేపీ, వారితో ఉన్న స్నేహంతో జనసేనలు కూడా తమ వంతు బిజీలోనే ఉన్నారు. ఇక ఏపీలో రాజకీయంగా ఖాళీగా ఉన్న పార్టీలను గురించి చెప్పాలంటే టీడీపీ, సీపీఐ, సీపీయంలేనన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పుడు స్నేహగీతం పాడేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు.

నిజానికి ఏపీలో సీపీఐ, సీపీయంలు టీడీపీకి జిగిరీ దోస్తులు. అయితే అప్పుడప్పుడు కాంగ్రెస్‌పార్టీతోనూ, ఆ తరువాత జనసేనతోనూ వీరు పొత్తులు పెట్టుకున్నప్పటికీ క్లిష్ట, కష్టతరమైన పరిస్థితులు ఎదురైప్పుడు టీడీపీ పంచనే చేరుతారని చెబుతుంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్ర తువ్వాలు కప్పుకున్న పవన్‌కళ్యాణ్‌ని, ఆయన జనసేన పార్టీని నమ్ముకుని పోటీకి వెళితే జనం నుంచి వీరిపట్ల పెద్దగా స్పందనేమీ కన్పించలేదు. దాని ప్రభావం వీరికొచ్చిన ఓట్లపై నేరుగానే పడింది. గతంలో ఎప్పుడూలేనంత తక్కువ ఓట్లు మాత్రమే వామపక్షాలు పొందగలిగాయి. అయితే ఇప్పటిక్కూడా ఏదైనా ప్రజా సమస్యలపై పోరాడాలి అంటే జెండా పట్టుకుని ముందు నిలబడే కరుడుగట్టిన కార్యకర్తలు సీపీఐ, సీపీయంలకు లేకపోలేదు. అయినప్పటికీ తడవకో పొత్తు కారణంగానే కార్యకర్తల్లో కూడా కసి తగ్గిపోయిందని విశ్లేషకులు తరచు చెబుతుంటారు.

అయితే ఇప్పుడు ఏపీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ ఉన్న శక్తి చాలడం లేదు. ఉన్న బీజేపీ–జనసేనలు తమకు అనుకూలమో? కాదో? ఇప్పటిక్కాదు, ఎప్పుటికి తేలుతుందో తెలీదు. ఇక మిగిలిన పార్టీలను కలుపుకుని కార్యాచరణకు సిద్ధమవుదామన్న సంకేతాలు అటు టీడీపీ నుంచి, ఇటు సీపీఐ, సీపీయంల నుంచి కూడా ఉన్నాయంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు పొత్తుపెట్టుకున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలకు కూడా సీపీఐ నారాయణ తెరలేపారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతే కాకుండా చంద్రబాబు అమరావతికి వీరుకూడా ఓ రకంగా మద్దతుగానే నిలుస్తారన్న అభిప్రాయం ఉండనే ఉంది.

ఈ నేపథ్యంలో ఒకరుకు ముగ్గురుంటే ఆ బలమే వేరు.. అన్న సూత్రానికి సిద్ధపడి వీరు మళ్ళీ కలవబోతున్నారన్న వార్తలు సోషల్‌ మీడియాలో ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. సో.. రానున్న రోజుల్లో వీరంతా ఏకమై చేసే పోరాటలు చూడాల్సిన రోజొచ్చినా రావొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి