iDreamPost

పరిషత్ ఎన్నికల ఫలితాల పై నేడు విచారణ

పరిషత్ ఎన్నికల ఫలితాల పై నేడు విచారణ

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడుస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఓట్ల లెక్కింపు జరగలేదు. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. గతంలో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని పేర్కొంది. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.

ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే విషయంలో ఎస్ఈసీ నీలం సాహ్నీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని, అందుకే నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్తగా జారీ చేయాలని టీడీపీ నేత వర్లరామయ్య గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఎన్నికలు నిలిపేస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్‌.. ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే తదుపరి తీర్పు ఇచ్చే వరకూ ఓట్ల లెక్కింపు జరగకుండా ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్ న్యాయమూర్తి వద్ద ప్రాధమిక విచారణ జరిగినందున ఓట్ల లెక్కింపుపైనా ఆయన వద్దకే వెళ్లి తేల్చుకోవాలని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 15న సింగిల్‌ బెంచ్‌ జడ్జి దీనిపై విచారణ చేపడతారని ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ సింగిల్ బెంచ్‌లో విచారణ ప్రారంభం కానుంది.

అయితే నోటిఫికేషన్‌లో నిబంధనలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయాక విచారణ నిర్వహించి హైకోర్టు ఏం తేలుస్తుందన్న అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఓట్ల లెక్కింపు, ఫలితాల కోసం అభ్యర్ధుల నిరీక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైసిపి ఈ ఎన్నికల్లో కూడా అదే ఊపు కొనసాగించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల ఆ పార్టీ నాయకులు పార్టీ అధినేత నిర్ణయాన్ని ధిక్కరించి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో గెలుపు పై వైసీపీ నేతలకు ధీమా ఉన్నప్పటికీ టిడిపి నేతల్లో మాత్రం గూబులు రేగుతోంది.

Also Read : గాల్లో ఏలూరు కార్పొరేషన్‌ ఫలితం.. విచారణ మళ్లీ వాయిదా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి