iDreamPost

నిమ్మగడ్డ యాప్‌కు హైకోర్టులో బ్రేక్‌

నిమ్మగడ్డ యాప్‌కు హైకోర్టులో బ్రేక్‌

పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసమంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకువచ్చిన ప్రైవేటు ఈ యాప్‌కు హైకోర్టులో మరోసారి బ్రేక్‌ పడింది. అనుమతులు లేనందున ఈ యాప్‌ను ఉపయోగంలోకి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

పంచాయతీ ఎన్నికలు నిర్వహణ తన సొంత వ్యవహారమన్నట్లు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ వాచ్‌ యాప్‌ను ఈ నెల 3వ తేదీన ఆవిష్కరించారు. ఎన్నికల పర్యవేక్షణకు, ఫిర్యాదుల కోసం దీన్ని తెస్తున్నామని, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ఇది ఎక్కడ తయారైంది, భద్రతాపరమైన అంశాలు, ఖర్చు.. తదితర వివరాలన్నింటినీ నిమ్మగడ్డ అత్యంత గోప్యంగా ఉంచారు. నిమ్మగడ్డ నిర్ణయంపై ఏపీ హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఎన్నికల పర్యవేక్షణకు వెబ్‌కాస్టింగ్, ఫిర్యాదుల కోసం సి విజిల్, నిఘా యాప్‌లు అందుబాటులో ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ వాచ్‌ యాప్‌ వినియోగాన్ని అడ్డుకోవాలని కోరింది. విచారించిన న్యాయస్థానం యాప్‌కు ఏపీ టెక్నాలజీ సర్వీస్‌ లిమిటెడ్‌ నుంచి అనుమతి ఉందా..? అన్ని ప్రశ్నించింది. ఐదు రోజుల్లో అనుమతి వస్తుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ న్యాయవాది తెలుపగా.. ఆ సమయం ఇస్తూ.. విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. తాజాగా దీనిపై మరోమారు విచారణ జరిపింది. యాప్‌కు అనుమతి లేనందున వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

పంచాయతీ ఎన్నికల్లో తాను తెచ్చిన ఈ యాప్‌ ద్వారా పర్యవేక్షణ, ఫిర్యాదులు స్వీకరించాలనే నిమ్మగడ్డ లక్ష్యం నెరవేరే పరిస్థితులు లేవని తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తేలిపోయింది. ఈ రోజు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ జరిగింది. 13వ తేదీన రెండో విడత, 17వ తేదీన మూడో విడత పోలింగ్‌ జరగబోతోంది. హైకోర్టులో తదుపరి విచారణ 17వ తేదీన జరగనున్న నేపథ్యంలో రెండు, మూడు విడతల పోలింగ్‌కు ఈ యాప్‌ వాడకం లేనట్లే. 17వ తేదీన జరిగే విచారణలో ఏం జరుగుతుందో చూడాలి. ఈ నెల 21వ తేదీన నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. ఈ రోజు పోలింగ్‌ను ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి