iDreamPost

గీతం ఆక్రమణలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గీతం ఆక్రమణలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖలోని గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన కట్టడాల తొలగింపు చర్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై స్టే విధిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30వ తేదీ వరకూ స్టే కొనసాగుతుందని ఉత్తుర్వుల్లో పేర్కొంది. ఆ లోపు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గీతం యూనివర్సిటీ హౌస్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవు అయినా.. అత్యవసర పిటిషన్‌ కింద ఈ వ్యవహారంపై విచారణ జరిగింది.

గీతం యూనివర్సిటీ ప్రభుత్వానికి చెందిన దాదాపు 45 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నదని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆ భూముల స్వాధీనం చేసుకునేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్నపాటి నిర్మాణాలను తొలగించి.. ప్రభుత్వ భూములు ఎంత వరకు ఉన్నాయో.. అక్కడ వరకు అధికారులు కంచె వేశారు. ప్రభుత్వ భూముల్లో గీతంకు చెందిన పెద్ద భవనాలు కూడా ఉన్నాయి.

భూ ఆక్రమణలపై మాట్లాడని గీతం యూనివర్సిటీ యాజమాన్యం.. తమకు నోటీసు ఇవ్వకుండా నిర్మాణాలను తొలగిస్తున్నారని, స్వాధీనం చేసుకుంటున్నారని వాదిస్తోంది. ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌కు చెందినదే గీతం యూనివర్సిటీ. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, యువ నేత నారా లోకేష్‌ సహా టీడీపీ సీనియర్‌ నేతలందరూ నిన్నటి నుంచి ఈ వ్యవహారంపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తున్నారు. అర్థరాత్రి తొలగిస్తున్నారని, ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పిన విద్యా సంస్థను ఇబ్బంది పెడుతున్నారంటూ మాట్లాడుతున్నారు గానీ ఆక్రమణలు నిజమా..? కాదా..? అనే అంశంపై మాత్రం మాట్లాడకపోవడాన్ని అందరూ గమనిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి