iDreamPost

ఏలూరు పంచాయితి తెగింది.. ఫలితమే రావాల్సిఉంది.

ఏలూరు పంచాయితి తెగింది.. ఫలితమే రావాల్సిఉంది.

ఏలూరు కార్పొరేషన్‌ వివాదం ముగింపు దశకు వచ్చింది. పోలింగ్‌ జరిగినా.. కోర్టు తీర్పునకులోబడి ఫలితాలు వెల్లడికాలేదు. ఈ వ్యవహరంపై ఇరు వైపుల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. కోర్టు తీర్పు ఎలా ఇస్తుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా కౌంటింగ్ తేదీ ఉంటుంది.

వివాదానికి మూలం విలీనమే..

పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలతో పాటుగా ఒక నగరపాలక సంస్థ ఉంది. వీటిలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాలిటీలతో పాటుగా ఏలూరు కార్పొరేషన్లో సమీప పంచాయతీలను విలీనం చేశారు. దీనిపై తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్పెషల్ ఆఫీసర్ల తీర్మాణాలతో విలీనం చేశారంటూ, అంతేకాకుండా శాస్త్రీయంగా ఓటర్ల జాబితా తయారు చేయలేదని, రిజర్వేషన్ ప్రక్రియ కూడా సక్రమంగా లేదని స్థానిక నేతలు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరులో మాత్రం యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.

దీన్ని సవాల్ చేస్తూ 48 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా ఎన్నికలను వాయిదా వేయాలంటూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు కార్పొరేటర్ అభ్యర్థులు బెంచ్ డివిజన్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని, అయితే వాదప్రతివాదాలు విన్న తర్వాత మాత్రమే కోర్టు తీర్పు అనుగుణంగా కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది.

Also Read : బీజేపీ-జనసేన పొత్తు పెటాకులవుతుందా? తేల్చనున్న తిరుపతి ఫలితం..!

తొలుత గత నెల 23 వతేదీకి వాయిదా వేసింది. అయితే గత నెల 23న విచారణ జరగాల్సి ఉండగా ఆ రోజు అత్యధికంగా కేసులు ఉండడంతో గత నెల 24వ తేదీకి వాయిదా వేశారు. 24వ తేదీన విచారణ చేపట్టగా కొందరు ప్రతివాదులు ఇంకా సంబంధిత దస్త్రాలను సమర్పించే లేదని, దానివల్ల కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు. ఏప్రిల్ ఒకటో తేదీన విచారణ చేపట్టగా వాదప్రతివాదనలు కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీన వాదనలు ప్రతి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మరో రెండు రోజుల్లో కోర్టు తన తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఇటు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొనగా అటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 2లక్షల 32వేల 378 మంది ఓటర్లుంటే…అందులో లక్షా 32వేల 478 మంది మాత్రమే ఓటేశారు. సాక్షాత్తు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు కావడం గమనార్హం. మరోవైపు భారీగా ఓట్ల గల్లంతుకు అధికారుల వైఫల్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు కార్పొరేషన్‌లో కేవలం 56.82 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. విలీన గ్రామాల ప్రజలను 50 డివిజన్లలో సర్దుబాటు చేయటంలో అధికారయంత్రాంగం విఫలమైందంటున్నారు నేతలు

అభ్యర్థుల్లో వీడని భయం..

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు చెమటోడ్చారు. ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే భయం మాత్రం ఉంది.

కౌంటింగ్ పై బెట్టింగులు..

బెట్టింగ్ రాయులు దేన్ని వదలడం లేదు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కోర్టు తీర్పుపైన కూడా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటి వరకు గెలుపోటములు పై బెట్టింగ్ లు కాయడం చూసుంటారు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేదానిపై బెట్టింగులు కాస్తున్నారు. కౌంటింగ్ ఉంటుందా.. ఉండదా అనేదానిపై బెట్టింగ్ లు కాస్తున్నారు.

Also Read : తప్పించుకుతిరుగుతున్న దేవినేని..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి