iDreamPost

ఏపీలో కొత్త జిల్లాల ఆశ‌లు కొండెక్కిన‌ట్టే..!

ఏపీలో కొత్త జిల్లాల ఆశ‌లు కొండెక్కిన‌ట్టే..!

ఏపీ ప్ర‌భుత్వం త‌న ల‌క్ష్యాల సాధ‌న కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఆటంకం త‌ప్పేలా లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లు తాత్కాలికంగా మ‌రుగున ప‌డేలా క‌నిపిస్తోంది. కేంద్రం జ‌నాభా లెక్క‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ దేశ‌వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌య‌త్నాలు విర‌మించుకోవాల‌నే సూచ‌న చేసింది. వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కూ జిల్లాల స‌రిహ‌ద్దులు మార్చ‌వ‌ద్దంటూ అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ‌లు రాసింది. దాంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 25 జిల్లాల ఏర్పాటు, దాని కన్నా ముందుగా మూడు జిల్లాల ఏర్పాటు ప్ర‌య‌త్నాలకు బ్రేకులు ప‌డిన‌ట్టే భావించాల్సి ఉంది.

ఏపీలో మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకి కేంద్రం నుంచి అనుమ‌తులు వ‌చ్చాయి. మూడు మెడిక‌ల్ కాలేజీలు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ద్వారా విద్యార్థుల‌కు మెడిక‌ల్ సీట్ల‌తో పాటుగా ఆయా ప్రాంతాల్లో మెరుగైన వైద్య స‌దుపాయాలు క‌ల్పించ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా అర‌కు, గుర‌జాల‌, మ‌చిలీప‌ట్నం ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించారు. అందుకు అనుగుణంగా భూసేక‌ర‌ణ స‌హా ప‌లు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే ఆయా కాలేజీల ఏర్పాటుకి సాంకేతికంగా ప్ర‌స్తుతం ఉన్న జిల్లాలు అడ్డంకిగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్ప‌టికే ఈ మూడు ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలున్నాయి. కొత్త కాలేజీల‌ను అదే జిల్లాల్లో ఏర్పాటు చేయ‌డం ఎంసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం సాధ్యం కాదు. దాంతో వీల‌యినంత త్వ‌ర‌గా మూడు జిల్లాల ఏర్పాటు కోసం ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసింది. మొన్న‌టి ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రాధ‌మిక చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి.

Read Also: ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలు?

అర‌కు, న‌ర్సారావుపేట‌, బంద‌రు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లాలుగా విభ‌జించాల‌నే నిర్ణ‌యానికి దాదాపుగా వ‌చ్చారు. అదే స‌మ‌యంలో న‌ర్సారావుపేట కేంద్రంగా ప‌ల్నాడు జిల్లా కోసం ప‌లువురు ప‌ట్టుబ‌డుతున్నారు. మెడిక‌ల్ కాలేజ్ పేరుతో జిల్లా కేంద్రం గుర‌జాల త‌ర‌లించ‌డం స‌మంజ‌సం కాద‌నే వాద‌నలు కూడా వినిపించాయి. అయితే అవ‌న్నీ ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్నందున ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని న‌ర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి వంటి వారు వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏకంగా జిల్లాల విభ‌జ‌న‌కే కేంద్రం కొర్రీలు వేయ‌డంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. అదే స‌మ‌యంలో కొత్త‌గా మూడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు అంశం సందిగ్ధంలో ప‌డుతోంది. జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ జిల్లాల స‌రిహ‌ద్దులు మార్చితే అధికారికంగా స‌మ‌స్య‌లు వ‌స్తాయని, వాటిని నియంత్రించేందుకు ఇలాంటి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు భావిస్తున్నారు. అయితే కేంద్రం ప్ర‌తిపాద‌న‌ల నేప‌థ్యంలో వీల‌యినంత త్వ‌ర‌గా ఏపీ ప్ర‌భుత్వం మూడు జిల్లాల పై నిర్ణ‌యం తీసుకునే యోచ‌న చేస్తుంద‌ని స‌మాచారం. త‌ద్వారా జ‌నాభా లెక్క‌ల‌కు ఆటంకం లేకుండా, ఇటు మెడిక‌ల్ కాలేజీల స‌మ‌స్య రాకుండా చేయాల‌నే ఆలోచ‌న సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి