iDreamPost

మూడు రాజ‌ధానుల‌కు ముహూర్తం ఫిక్స్ ?!

మూడు రాజ‌ధానుల‌కు ముహూర్తం ఫిక్స్ ?!

మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. అది ఇప్ప‌టి వ‌ర‌కూ కార్యరూపం దాల్చ‌లేదు. కోర్టు కేసుల ఇబ్బందుల రూపంలో ఇబ్బందులు త‌లెత్త‌డంతో ప్ర‌భుత్వం వేచి చూస్తోంది. కాగా.. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి పరిపాలనను విశాఖపట్నానికి తరలించడానికి గ‌త ఏడాదిలోనే ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా కోర్టు స్టేట‌స్ కో ఇవ్వ‌డంతో ఆ ప్ర‌య‌త్నాల‌ను తాత్కాలికంగా విర‌మించింది. కొత్త సంవత్సరాది ఉగాది రోజైన ఏప్రిల్ 13వ తేదీ నుంచి విశాఖకు పరిపాలనను బదలాయించబోతోన్నట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌లు దీనికి బ‌లం చేకూరుస్తున్నాయి. ఉగాది పండుగ నుంచి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారబోతోందని ప్రకటించారు. ఇకపై విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉగాది నుంచి చట్టపరంగా విశాఖ నుంచి రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు. అప్ప‌టిలోగా కోర్టు కేసులు కొలిక్కి వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్లుగా చెప్పారు.

ఇప్ప‌టికే విశాఖ‌న‌గ‌రంపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించింది. కొత్త ఏడాదిలో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పాల‌నా రాజ‌ధాని విష‌యంలో క‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించడంలో ఇక ఏ మాత్రం జాప్యం చేయకూడదనే పట్టుదల ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోన్నట్లు చెబుతున్నారు. ఈ సారి తగ్గేలేదేంటోన్న మంత్రులు.. విశాఖపట్న నుంచి పరిపాలనను సాగించే విషయంలో ఆ సారి వెనక్కి తగ్గేదేల లేదని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ తాజాగా దీనిపై లీకులు ఇస్తున్నారు. విశాఖ నుంచి పరిపాలనను సాగించడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదంటూ విశాఖకు చెందిన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థాన్ని సందర్శించిన అనంతరం ఆయన విశాఖలో పార్టీ నేతలతో కొద్దిసేపు సమావేశమైన సందర్భంగా దీని గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

క్యాంప్ ఆఫీస్‌గా పోర్ట్ గెస్ట్‌హౌస్..

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఇంకా ఖచ్చితంగా ఖరారు కానప్పటికీ.. విశాఖ పోర్ట్‌కు చెందిన అతిథిగృహాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇదివరకే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పోర్ట్ గెస్ట్‌హౌస్‌ను కూడా పరిశీలించారు. పోర్ట్ గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దీనికి వైఎస్ జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. అన్నీ కుదురుకున్నాయని, అందుకే రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో ప్రభుత్వం జాప్యం చేయదలచుకోలేదని అంటున్నారు. త్వరలో షిఫ్టింగ్.. సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడంలో జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పరిపాలనను విశాఖ నుంచే ఆరంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. భీమిలీ సమీపంలో మూతపడిన పైడా ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చంటూ ఇదివరకే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దాదాపుగా ఆ ఇంజినీరింగ్ కళాశాల భవనాన్నే సచివాలయంగా మార్చడానికి వైఎస్ జగన్ సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పాల‌నా రాజ‌ధాని త‌ర‌లింపు మొద‌లైతే ఆటోమేటిక్ గా మిగిలిన రాజ‌ధానుల‌కు చెందిన ప‌నులు కూడా ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలుస్తోంది. గ‌త నెల‌లో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ ఖ‌ర్నూలు న్యాయ రాజ‌ధానిగా ఏర్పాటు కావ‌డానికి కావాల్సిన అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద ప్ర‌స్తావించారు కూడా. వారు సానున‌కూలంగా స్పందించిన‌ట్లు కూడా తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి