iDreamPost

సుప్రింకు చేరిన రంగుల అంశం

సుప్రింకు చేరిన రంగుల అంశం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలి ఉన్న రంగుల తొలగింపు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ అంశంపై ఇటీవల దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన ఏపీ హైకోర్టు పది రోజుల్లో ఆ రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ జగన్‌ సర్కార్‌ సుప్రిం కోర్టును ఆశ్రయించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద రంగుల అంశంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ పిటిషన్‌లో కోరింది.

గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా రంగుల అంశంపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం మూడు వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయిందని ఆయన ఆరోపించారు. రంగులు వేయడానికి పదిహేను వందల కోట్లు, తిరిగి కొత్త రంగులు వేయడానికి పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతోందని బాబు మండిపడ్డారు.

తాజాగా రంగుల అంశం సుప్రింకు చేరడంతో ఈ విషయంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. సుప్రింలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా తీర్పు వస్తుందా..? లేదా హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి