iDreamPost

సంస్కరణల్లో భాగంగానే ఆర్డినెన్స్ .. స్పష్టం చేసిన ప్రభుత్వం

సంస్కరణల్లో భాగంగానే ఆర్డినెన్స్ .. స్పష్టం చేసిన ప్రభుత్వం

ఎన్నికల కమీషనర్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన విషయంలో ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించింది. నిమ్మగడ్డ తొలగింపుపై శనివారం హై కోర్టులో ఓ అఫిడవిట్ వేసింది. అందులో మాజీ కమీషనర్ ను తొలగింపుపై సమర్ధవంతంగా తన వాదనను వినిపించింది. రమేష్ కుమార్ ను తొలగించటం కోసమే చట్టంలో మార్పులు తెచ్చామన్న ఆరోపణలను ప్రభుత్వం కొట్టేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ, కమీషన్లో సంస్కరణలు తేవటంలో భాగంగా అనేక చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల్లో కమీషనర్ పదవీకాలం కుదించటం కూడా ఒకటిగా ప్రభుత్వం చెప్పింది. ఐదేళ్ళ పదవీకాలాన్ని మూడేళ్ళకు కుదించటం వల్ల అప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్న కారణంగా నిమ్మగడ్డ సర్వీసు కూడా ముగిసిందని కోర్టుకు చెప్పింది. సంస్కరణల్లో భాగంగా కమీషనర్ గా రిటైర్డ్ హై కోర్టు జడ్జిని నియమిస్తే తీసుకునే నిర్ణయాలు న్యాయపరంగా, నిష్పక్షపాతంగా ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు అఫిడవిట్లో చెప్పింది. ఇందులో భాగంగానే చైన్నై హైకోర్టుకు జస్టిస్ గా పనిచేసిన వి. కనగరాజును కొత్తగా నియమించినట్లు స్పష్టం చేసింది.

ఆర్టికల్ 243 (కే)2 ప్రకారం కమీషనర్ పదవీకాలం వేరు సర్వీసు వేరని స్పష్టంగా ఉందన్నారు. నిమ్మగడ్డ తొలగింపులో చట్టాన్ని అతిక్రమించిందేమీ లేదని అంతాకూడా చట్టానికి లోబడే చేసినట్లు అఫిడవిట్లో చెప్పింది. 1994 పంచాయితీరాజ్ నిబంధనల ప్రకారమే ఆర్డినెన్స్ జారీ చేసినట్లు చెప్పటంతో నిమ్మగడ్డకు ఇబ్బందులు మొదలయ్యాయి. నిజానికి ఆర్టికల్ 243 (కే)2 ప్రకారం కమీషనర్ సర్వీసు కాలం వేరు పదవికాలం వేరు అన్న విషయం స్పష్టంగా ఉంది.

అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం అత్యున్నతస్ధాయి న్యాయకోవిదుల సలహా ప్రకారమే నిమ్మగడ్డ తొలగింపు విషయంలో ప్రభుత్వం ముందుకెళ్ళింది. తాము తయారు చేసిన ఆర్డినెన్స్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ను ఆమోదిస్తు సంతకం చేసిన విషయాన్ని ప్రభుత్వం తన అఫిడవిట్లో గుర్తుచేసింది. సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించటం చాలా బాధాకరమని కూడా ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం తరపున పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది అఫిడవిట్ వేశారు. అంతకుముందే తన తొలగింపుపై అభ్యంతరాలు వ్య క్తం చేస్తు మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు వేసిన విషయం అందరికీ తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి