iDreamPost

వెనక్కి వెళితేనే అభివృద్ధి అంటున్న వైఎస్‌ జగన్‌

వెనక్కి వెళితేనే అభివృద్ధి అంటున్న వైఎస్‌ జగన్‌

కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుతూ ముందుకు వెళితనే అభివృద్ధి సాధ్యమనే మాట తరచూ వింటుంటాం. అధిక సందర్భాల్లో ఇది వాస్తవం కూడాను. అయితే ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం ఒక అంశంలో వెనకటి కాలానికి వెళితేనే ఓ రంగంలో అభివృద్ధితోపాటు స్వయం సమృద్ధి సాధ్యమంటున్నారు. అలా అనడమే కాదు సదరు రంగంలో పూర్వ స్థితికి వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆ రంగం మరేదో కాదు.. కరోనా సమయంలోనూ కార్యకలాపాలు ఆగకుండా సాగి.. దేశ ప్రజలు అన్నం పెడుతున్న వ్యవసాయ రంగం.

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు ఇతర సేవలను అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ రంగంలో మరో సరికొత్త కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. విత్తనాలు సమకూర్చుకోవడంలో రైతులు తిరిగి స్వయం సమృద్ధి సాధించేలా చేసేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ‘విత్తన గ్రామం’ పేరిట జరగబోయే ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమకు అవసరమైన వివిధ సాగు విత్తనాలను వారే సమకూర్చునేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయనుంది.

దాదాపు పదిహేనేళ్ల కిత్రం వరకూ రైతులు పంట విత్తనాలను తామే స్వయంగా సేకరించుకునేవారు. సాధారణంగా ఆయా ప్రాంతాలలోని రైతులు స్థిరంగా కొన్ని రకాల పంటలు సాగు చేస్తారు. ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు తమకు కావాల్సిన విత్తనాలను పంట విక్రయించుకునే సమయంలోనే సేకరించి పెట్టుకునేవారు. తర్వాత ఏడాది వాటిని విత్తనాలుగా ఉపయోగించుకునేవారు.

అయితే సాంప్రదాయ వ్యవసాయం స్థానంలో క్రమంగా ఆధునిక వ్యవసాయం ప్రారంభమైన తర్వాత విత్తనాల సేకరణ కష్టంగా మారింది. పంట నాణ్యత కూడా తగ్గిపోతుండడంతో రైతులు మరుసటి ఏడాదికి అవసరమైన విత్తనాలను సేకరించుకునే పరిస్థితి లేకుండాపోయింది. సేంద్రీయ ఎరువుల స్థానంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన ఆవశ్యకత ఆధునిక వ్యవసాయం వల్ల అధికమైంది. ఫలితంగా రైతులు స్వయం సమృద్ధిని కోల్పోయారు. పంటలకు తెగుళ్లు, ఉత్పత్తిలేమి, నాణ్యతలేని పంట.. ఇలా అనేక రుగ్మతలు రైతులను వెంటాడుతున్నాయి. వీటన్నింటికి కారణం.. విత్తనమే.

సహజ సిద్ధంగా సేకరించుకునే విత్తనానికి తెగుళ్లను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. అదే కంపెనీలు విక్రయించే విత్తనాలకు ఆ శక్తి ఉండదు. ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడాల్సి ఉంటుది. దీని వల్ల రైతులకు పెట్టుబడి పెరుగుతోంది. అదే సమయంలో ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తోంది. పెట్టుబడి, ఆదాయంలో వ్యత్యాసం పెరగడం వల్ల రైతులకు వ్యవసాయం గిట్టుబాటుకాని రంగంగా మారిపోయింది. అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. మొత్తం వ్యవసాయమే సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితి నుంచి రైతులు బయటపడాలన్నా.. తిరిగి వ్యవసాయం లాభసాటిగా మారాలన్నా.. రైతులు తాము సాగుచేసే పంటలకు అవసరమైన విత్తనాలను వారే తాము పండించే పంటల నుంచి సమకూర్చుకోవాలి. ఈ దిశగా రైతులను సంసిద్ధం చేసే విత్తన గ్రామం కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోతుండడం అన్నదాతలకు ఎంతో మేలు చేయబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి