iDreamPost

సచివాలయ సిబ్బందిని పరిగెత్తిస్తున్న ప్రభుత్వం

సచివాలయ సిబ్బందిని పరిగెత్తిస్తున్న ప్రభుత్వం

గాలిలో దీపం మాదిరిగా సాగే వ్యవసాయంలో పంట చేతికి వచ్చినా.. ఇంటికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి విపత్తులు, కరువులు, అధిక వర్షాలు.. ఇలా ఏవైనా సరే వ్యవసాయానికి గొడ్డలిపెట్టు వంటివే. కాలం బాగా అయి, ప్రకృతి విపత్తలు లేకుండా ఉంటేనే పంట ఇంటికొచ్చేది. లేదంటే రైతులు పెట్టిన పట్టుబడి అంతా నష్టపోవడం తప్పా మరో గత్యంతరం లేదు. వర్షాలు, ప్రకృతి విపత్తలను ప్రజలు, ప్రభుత్వాలు.. ఎవరూ నియంత్రించలేరు.

కానీ పంట నష్టపోతే ఆదుకునే అవకాశం మాత్రం ప్రభుత్వాలకు ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ రైతులను, వ్యవసాయాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేయగా.. యువ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రైతు ముందు అంటూ పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తున్నారు. పంట నష్టపోతే పరిహారం వచ్చేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్సార్‌ ఉచిత పంట బీమా పథకం ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి ప్రారంభమైంది. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసిన వివిధ రకాల పంటలకు గ్రామ సచివాలయంలో ఉండే వ్యవసాయ సహాయకులు బీమా చేశారు. పొలం వద్దకు వెళ్లిన గ్రామ వ్యవసాయ సహాయకుడు రైతుతో కూడిన పంట పొలం ఫొటోను తీసి ఈ పంట (ఈ క్రాఫ్‌) నమోదు చేశారు. ఈ పంట నమోదు వలన రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట ఎంత మేర సాగు జరిగిందీ ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఈ పంట నమోదు చేస్తే చాలు.. రైతులకు పంట బీమా, ప్రభుత్వం ద్వారా పంట విక్రయం, పంట నష్ట పరిహారం, రైతు భరోసా పథకం, వడ్డీ లేని రుణాలు అన్నదాతలకు లభిస్తాయి.

ప్రస్తుతం రబీ సాగు మొదలైంది. దీంతో రబీ పంటలను ఈ పంట చేసేందుకు గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. రబీ సీజన్‌లో సాగు చేసే వరి, మినుము, అలసంద, శెనగ తదితర పంటలను ఈ పంటలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారాన్ని రైతు భరోసా కేంద్రాల పేరుతో ఏర్పాటు చేసిన వాట్స్‌ అప్‌ గ్రూపుల ద్వారా, వలంటీర్ల ద్వారా రైతులకు చేరవేస్తున్నారు. రైతులతో తాము సాగు చేసిన పంటలను ఈ క్రాఫ్‌ చేయించే బాధ్యతను వలంటీర్లు నిర్వర్తిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి