iDreamPost

కష్టకాలంలో రైతుకు అండ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

కష్టకాలంలో రైతుకు అండ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

రైతుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆ దిశగా పని చేస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల నివర్‌ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలను చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ నెలాఖరు నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేబోతున్నారు. ఈ లోపు గత ఏడాది జరిగిన పంట నష్టం తాలూకు బీమా పరిహారం కూడా రైతుల ఖాతాల్లో జమ కాబోతోంది. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము 1,252 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.

ఖరీఫ్‌లో వర్షాల వల్ల చేతికి వచ్చే దశలో ఉన్న పంటను రైతులు నష్టపోయారు. వరి, కంది, మిర్చి తదితర పంటలను రైతులు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రైతులు నష్టపోయారు. అయితే కంది, మిర్చి ఎక్కువగా సాగు చేసే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. పంట నష్టపోయినా 9.48 లక్షల మంది రైతులకు 1,252 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

వైసీపీ అధికారంలోకి రాక ముందు పంట బీమా చేయించుకునే రైతుల సంఖ్య పరిమితంగా ఉండేది. ప్రీమియం మొత్తం రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ఉండడంతో.. అన్నదాతలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. పైగా ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి అవగాహన చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే బీమా ప్రాధాన్యతను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం.. ప్రతి ఎకరాకు బీమా కల్పించాల్సిన అవసరాన్ని రైతులకు వివరించింది. అంతేకాకుండా రూపాయికే బీమా పథకం ప్రవేశపెట్టింది. వైఎస్సార్‌ పంటల బీమా పథకాన్ని తెచ్చింది. దీంతో రైతులందరూ రూపాయి చెల్లించి మీ సేవా కేంద్రాల ద్వారా బీమా చేయించుకున్నారు. ఈ ఏడాది గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రావడంతో సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకుడు అన్ని పంటలను ఈ క్రాఫ్‌ చేశారు. ఈ క్రాఫ్‌ చేయడం ద్వారా బీమాతోపాటు పంట విక్రయానికి మార్గం సుగమమైంది.

బీమా సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతులకు నష్టం లేకుండా ఉండేలా బీమా సొమ్మును అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1.14 కోట్ల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 10,641 గ్రామ సచివాలయాలు, వాటి పరిధిలోని వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి