iDreamPost

కొత్త మంత్రుల జాబితా సిద్ధం.. మీడియాకు ఆహ్వానాలు!

కొత్త మంత్రుల జాబితా సిద్ధం.. మీడియాకు ఆహ్వానాలు!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేసిన సమయంలో రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని ప్రకటించారు. అయితే కరోనా తదితర అంశాల కారణంగా అది కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లోని మంత్రులందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రాజీనామాలు సమర్పించారు. కొత్తగా మంత్రులు ఏప్రిల్ 11వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కొత్త మంత్రులతో పాటు పాత మంత్రులు కూడా కొంతమంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 90 శాతం మంత్రులు కొత్తవారే ఉంటారని కేవలం పదిశాతం మంది మాత్రమే అనుభవం, అవసరం ఉన్నవారిని కొనసాగిస్తారని ప్రచారం జరిగింది.

ఇప్పుడు పాత మంత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కనపెడితే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా రెండో రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘ భేటీ జరిపారు. నిజానికి శుక్రవారం నాడు ఆయన సుమారు మూడు గంటలపాటు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోసారి శనివారం నాడు కూడా దాదాపు మూడు గంటలపాటు ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీలో దాదాపు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీకి విధేయత అంశాల ఆధారంగా జాబితా సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ దగ్గరకు మంత్రుల రాజీనామా ఫైల్ పంపనున్నారు. ఆ వెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేసే అవకాశం వుంది. ఆ తరువాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు సీల్డ్ కవర్ లో జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్ 11 ఉదయం 11.31 నిమిషాలకు ప్రమాణస్వీకారం జరగనుందని మీడియాకు సమాచారం అందుతోంది. ఇక ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేలంతా శిరోధార్యంగా భావిస్తామని మంత్రులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు రాజీనామా చేసిన మంత్రులను పార్టీ గెలుపు కోసం రంగంలోకి దించనున్నారు. 2024లో అధికారంలోకి వచ్చాక వారికి మరోసారి అవకాశం కల్పిస్తారని జగన్ హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి