iDreamPost

రాత్రి 10 గంటల మంత్రివర్గ అత్యవసర సమావేశం.. ఏం జరగబోతోంది..?

రాత్రి 10 గంటల మంత్రివర్గ అత్యవసర సమావేశం.. ఏం జరగబోతోంది..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా ఈ రోజు రాత్రి 10 గంటలకు సమావేశం కాబోతోందని సమాచారం. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను చూసిన సమస్యలు, ప్రజల కష్టాలు తీర్చేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కృషి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు చట్ట సభల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండడంతో ప్రజలకు మేలు చేసే బిల్లులను కూడా మండలి తిప్పి పంపుతుండడంతో సీఎం జగన్‌ ఈ అంశంపై కొద్ది రోజులుగా సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా శాసన మండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకోసమే ఈ రోజు రాత్రి అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.

ఇప్పటికే శాసన మండలి రద్దుపై న్యాయపరమైన అంశాలను చర్చిస్తున్నారు. న్యాయ సలహా అనంతరం మండలి రద్దుపై రాత్రి నిర్వహించే క్యాబినెట్‌ భేటీలో తీర్మానం చేసి ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి పంపేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

నిన్న సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ మూడు రోజులు, మండలి సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు మండలి ప్రారంభమైంది. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభ ఆమోదించి పంపిన ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు బిల్లును మండలి తిప్పి పంపింది. అంతేకాకుండా నిన్న తాజాగా అసెంబ్లీ ఆమోదించిన ఏపీ పాలనా వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఈ రోజు మండలి వద్దకు వెళ్లాయి. అవి సాధారణ బిల్లులే కావడంతో మండలి ఆమోదం తప్పనిసరి కానుంది. భవిష్యత్‌లో ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై మరిన్ని చట్టాలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శాసన మండలిని కొనసాగించడం వల్ల చిక్కులు తప్పవనే భావనతో రద్దు అంశం తెరమీదకు తెస్తున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి