iDreamPost

ఐటీ కంపెనీకి సోకిన కరోనా, ఇంటి నుంచే పని చేయమంటున్న కంపెనీలు

ఐటీ కంపెనీకి సోకిన కరోనా, ఇంటి నుంచే పని చేయమంటున్న కంపెనీలు

చైనాని అతలాకుతలం చేసిన కరోనా ఇప్పుడు భారతదేశంలో కూడా అడుగు పెట్టింది. కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కరోనా వైరస్ అడుగుపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు తెలియడంతో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

కరోనా సోకినా సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేంద్ర హిల్స్ కి చెందిన వ్యక్తి కావడంతో ఆ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహేంద్ర హిల్స్ వీధులను శుభ్రం చేసి వ్యాధి సోకిన వ్యక్తి ఇంటి చుట్టూ యాంటీ వైరస్ పిచికారీ చేసారు.

మైండ్ స్పేస్ బిల్డింగ్ లో ఉన్న DSM కంపెనీ తమ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ ని పంపింది. కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతికి కరోనా సోకిందని ఆమె కోలుకోవాలని ప్రార్ధించాలని ఆ మెయిల్ సారాంశం..ఈ ఈమెయిల్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. దాంతో మైండ్ స్పేస్ లో ఉన్న మిగిలిన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటినుండి పని చేయాలని ఆదేశాలిచ్చాయి. వైరస్ సోకినట్లు భావిస్తున్న ఉద్యోగిని ఇటీవల ఇటలీ వెళ్ళొచ్చినట్లు సమాచారం.  మైండ్ స్పేస్ లోని బిల్డింగ్ నంబర్ 20 లో 12 అంతస్తులు ఉన్నాయి. ఈ 12 అంతస్తుల్లో 12 కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. దీంతో బిల్డింగ్ ను ఖాళీ చేయించి ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆదేశాలను జారీ చేశారు. దీంతో కరోనా భయంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంతా ఇంటిబాట పట్టడంతో రహేజా ఐటీ పార్క్ నిర్మానుష్యంగా మారింది.

DSM లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగినికి కరోనా ఉన్నట్లు తెలియడంతో ఆమెతో పనిచేసిన సహోద్యోగులంతా గాంధీ హాస్పిటల్స్ కి టెస్టుల కోసం క్యూ కట్టారు.. ఇప్పటికే కరోనా వైరస్ ఉన్నట్లు అనుమానం ఉన్న వ్యక్తులంతా ఒకేసారి గాంధీ హాస్పిటల్ కు చేరుకోవడంతో గాంధీ హాస్పిటల్ కిటకిటలాడుతోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. గాంధీ ఆసుపత్రి నగరం మధ్యలో ఉండటం మరియు జనసమ్మర్ధమైన ప్రాంతం కావడం వల్ల వ్యాధి మరింతగా వ్యాపించే అవకాశం ఉండటంతో కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రత్యేకమైన కరోనా ఆసుపత్రి కోసం అన్నివిధాలా అనుకూలమైన హాస్పిటల్స్ ని పరిశీలిస్తున్నారు. వీటిలో భాగంగా చెస్ట్ ఆసుపత్రితో పాటు, సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిని కరోనా హాస్పిటల్‌గా మార్చే ఆలోచన చేస్తుంది. దీంతో పాటు అనంతగిరి ఆసుపత్రిని కూడా పరిశీలిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి