iDreamPost

నారా లోకేష్ పై యూనివర్సిటీ విసి సంచలన ఆరోపణలు

నారా లోకేష్ పై యూనివర్సిటీ విసి సంచలన ఆరోపణలు

ఆంధ్రా యూనివర్సిటీలో పెంచిన పరీక్ష ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ యస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో, ఫీజుల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు నారా లోకేష్ మద్దతు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో లోకేష్ తెలుగుదేశం అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) తరపున తాను విద్యార్థులు చేస్తున్న నిరసనల్లో పాల్గొంటానని ట్విటర్ వేదికగా తెలిపారు.

అయితే ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలకు మాజీ మంత్రి నారా లోకేశ్ మద్దతివ్వడం పట్ల ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కారణంగానే ఇవాళ ఏయూ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చారన్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీ విసి లోకేశ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలకు 3 నెలల ముందు యూనివర్సిటీ నిధులను సొంత పార్టీ కార్యక్రమానికి లోకేష్ మళ్లించుకున్నారని, విద్యార్ధులకు చెందాల్సిన సొమ్మును భారీగా దుర్వినియోగం చేశారని వెల్లడించారు.

యూనివర్సిటీకి సంబంధించి బ్లాక్ గ్రాంట్స్ ఇవ్వకపోగా ఇంటర్నల్ గ్రాంట్స్ ను కూడా అడ్డగోలుగా వాడుకున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన నిధుల్లోనుంచి దాదాపుగా వందకోట్లకు పైగా ఎన్నికల సమయంలో దారి మళ్లించి పసుపు కుంకుమ పధకానికి కేటాయించారని యూనివర్సిటీ విసి సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్ధులకు ఉపయోగపడాల్సిన వంద కోట్ల యూనివర్సిటీ నిధులను నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ గెలుపుకోసం వాడుకున్నారని, అలాగే గతంలో లోకేశ్ నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమాలకోసం యూనివర్సిటీకి చెందిన 4 కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించి, యూనివర్సిటీ నిధులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు.

ప్రస్తుతం క్యాంపస్ లో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందన్నారు. విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఏమాత్రం సరికాదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని వీసి ప్రసాద్ రెడ్డి ఆగ్రహించారు. మెస్ చార్జీలు, ఫీజుల పెంపుపై తీసుకున్న నిర్ణయం తనది కాదని, గతంలో వీసీ హయాంలో తీసుకున్న నిర్ణయమేనన్నారు. విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని, విద్యార్ధులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

అయితే ప్రస్తుతం వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు, అవినీతికి సంబంధించిన విమర్శలు సహజమే కానీ ఏకంగా రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైన యూనివర్సిటీ వీసీ ఇలా మాజీమంత్రి పై లెక్కలు, పధకాల పేర్లతో సహా అవినీతికి ఎలా పాల్పడ్డారో చెప్పడం రాజకీయంగా సంచలనమైంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి