iDreamPost

చంద్రబాబు రీడిజైన్ చేసిందాక ఆగేలా లేరే! …

చంద్రబాబు రీడిజైన్ చేసిందాక ఆగేలా లేరే! …

ఇతర రాష్ట్రాల నుండి సొంత రాష్ట్రాలకు నడకన వెళ్లే వలస కార్మికులను మనుషుల్లాగా గుర్తించమని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు టీడీపీ అధ్యక్షులు శైలజానాధ్ విజ్ఞప్తి చేసారు .

17-May-2020 ఆంధ్ర ప్రభ – 

వార్త చదవగానే తాగుతున్న టీ పొలమారింది .

అరె నిన్నేగా చంద్రబాబు టీడీపీని రీడిజైన్ చేస్తానని ప్రకటించింది . రాత్రికి రాత్రి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకొని పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం శైలజానాధ్ ని కాంగ్రెస్ లో నుండి టీడీపీలోకి ఆహ్వానించడం అధ్యక్ష పదవి అప్పచెప్పడం ఎప్పుడు జరిగింది . అయినా కాంగ్రెస్ , టీడీపీ పొత్తులో ఉన్నాయి కదా ? . పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ కాంగ్రెస్ నుండి శైలజానాధ్ ని చేర్చుకొని అధ్యక్ష పదవి ఎలా అప్పచెప్పింది .ఇందుకు కాంగ్రెస్ ఎలా ఒప్పుకొంది . 

ఇవన్నీ పక్కన పెడితే నిన్నటి వరకూ బాబు తర్వాత వారసుడు అనుకొన్న టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ని అధ్యక్షుడు చేయకుండా, లేదా టీడీపీ అవిర్భావకర్త రామారావు తనయుడు బాలయ్య కైనా అప్పచెప్పకుండా , పార్టీలో ఇంతమంది సీనియర్లు ఉండగా వారినొదిలేసి కాంగ్రెస్ నుండి అప్పటికప్పుడు శైలజానాధ్ ని తీసుకొచ్చి అధ్యక్షుణ్ణి చేయడం ఏంటి ? . అసలేమైంది అంటూ మిగతా పత్రికలు అన్నీ తిరగేస్తే ఎక్కడా ఏమీ వార్త కనపల్లేదు . చివరికి ఆస్థాన పత్రిక కొత్త పలుకులో కూడా పట్టిసీమని వైఎస్ కట్టాడంటున్నారు అనే సరికొత్త పలుకు కనపడింది కానీ ఈ టీడీపీ అధ్యక్షులు రీడిజైన్ వార్త కనపల్లేదు . 

రీడిజైన్ వర్క్ లో ఎదో కుట్ర జరుగుతోందని అనుమానంతో ఆంతరంగిక వ్యక్తులు , అభిజ్ఞ వర్గాల ద్వారా భోగట్టాలతో విశ్వసనీయ సమాచారం ఏంటని ఆరా తీయగా నిన్న బాబు గారు రీడిజైన్ చేస్తానన్న దరిమిలా కాంగ్రెస్ నేత శైలజా నాధ్ స్టేట్మెంట్ ప్రింట్ కిచ్చే క్రమంలో ఇదే ఆలోచనలో ఉండి టీడీపీ అధ్యక్షుడు శైలజానాథ్ అని వార్త ఇవ్వటం అది అచ్చేయటం జరిగిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి .

అయ్యా ఆంధ్రప్రభ వారూ బాబుకి ఎంత అనుకూలం అయితే మాత్రం ఎప్పుడూ ఆయన ఆలోచనలే అయితే ఎలా ? . ఆయన రీడిజైన్ చేసిందాక కొంచెం ఆగండి . మీరే రీడిజైన్ చేస్తే ఎలా ? , మళ్లీ జాతీయ అధ్యక్షుడికి కోపం రాగలదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి