iDreamPost

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి -పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి -పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెల‌గాట‌మాడుతున్నట్లే అని వెల్లడించారు. ఏపీకి పొరుగున ఉన్న త‌మిళ‌నాడు, తెలంగాణ‌, చ‌త్తీస్ గ‌డ్‌, ఒడిశా రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎక్క‌డా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవ‌ని వెల్ల‌డించారు. డిగ్రీ, పీజీ, ఉన్న‌త‌మైన వృత్తి సంబంధిత ప‌రీక్ష‌ల‌తో పాటు ప్ర‌వేశ‌, ఉద్యోగ ప‌రీక్ష‌లు సైతం రద్దయిపోయాయని హైదరాబాద్ లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి అక్కడి హైకోర్టు ఒప్పుకోలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ‌వుతున్నాయ‌ని, 6 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయ‌ని ప‌రీక్ష కేంద్రాల‌కు పిల్ల‌ల‌ను తీసుకెళ్ల‌డం ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని, ప్రైవేటు వాహ‌నాలు కూడా చాలా త‌క్కువ‌గా అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు పవన్ కళ్యాణ్. త‌ల్లిదండ్రుల కోరిక‌, చిన్నారుల ప్రాణాల‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్న‌ట్లు ట్విట్టర్ ద్వారా కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి