iDreamPost

అమ్మా మన్నించు.. ఆంధ్రజ్యోతిని క్షమించు..

అమ్మా మన్నించు.. ఆంధ్రజ్యోతిని క్షమించు..

ఆంధ్రజ్యోతి రాతల్లో అర్థం పర్థం ఉండదు.. అక్షరక్షరాన అంతులేని విషం జల్లడమేనని ఓ పాత్రికేయుడు అన్న మాటను అక్షర సత్యంగా మలిచే పని సాగుతోంది. అందుకోసమై రాధాకృష్ణ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆక్రమంలో ఆయన బాధాకృష్ణగా కూడా మారుతున్నారు. తాజాగా ఆయన పత్రిక పతాక శీర్షికలో అమ్మా..మన్నించు అంటూ ఓ కథనం అల్లేశారు. దాని ప్రకారం ఏపీలో అమ్మ ఒడి పథకానికి చాలామంది దూరమయిపోతున్నారు. సవాలక్ష షరతులతో ఆంక్షల ఒడిలో అమ్మ ఒడి పథకం అంటూ ఏదో జరిగిపోతోందనే రీతిలో వార్త వండేశారు.

అసలు ఇంతకీ ఏం జరుగుతోంది.. ఎలాంటి ఆంక్షలు పెట్టారు.. ఆ సవాలక్ష షరతులు ఏంటీ అని పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అలాంటి కనీస షరతులు కూడా లేకుండా అనర్హులకు కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం అవసరమా అనే ప్రశ్న అందరూ వేస్తారు. నిజానికి కొన్ని నెలలుగా రాధాకృష్ణ, ఇతర పచ్చ మీడియాలో వాపోతున్నట్టుగా ఏపీలో 8లక్షల మందికి బియ్యం కార్డులు దూరమయినా ఇప్పటికీ ఒక్కరు కూడా అయ్యో..మాకు అన్యాయం జరిగిందే అనలేదు. కారణమేమంటే అనర్హులకు ప్రభుత్వ పథకాలు చేరడం, అవి పక్కదారి పట్టడం అనే ఆనవాయితీకి చెక్ పెడతామని ఈ ప్రభుత్వం ప్రారంభంలోనే చెప్పింది. ముఖ్యంగా రేషన్ బియ్యం తెచ్చుకోవడం వాటిని మళ్లీ బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడం, వాటిని కొందరు వ్యాపారులు మళ్లీ పాలిష్ చేసి మరింత లాభాలకు వినియోగదారులకు కట్టబెట్టడం అనే చెయిన్ లింక్ దందా చాలాకాలంగా సాగుతోంది. ఇప్పుడు దానికి చెక్ పెట్టేందుకు గానూ అవసరమైన వాళ్లకే బియ్యం కార్డు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం అమ్ముకునేవాళ్లకు కాకుండా వాటిని వండుకు తినేవాళ్లకే కొనసాగిస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగా ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వాళ్ళు, కారు వంటి ఫోర్ వీలర్ ఉన్న వాళ్లకు బియ్యం కార్డులు కత్తిరించింది. దానికే గగ్గోలు పెట్టే పచ్చ మీడియా ఒక్కరికీ కూడా అర్హులకు కార్డు పోయిందని మాత్రం చెప్పలేకపోతోంది.

ఇక అమ్మ ఒడికి పెట్టిన అర్హతలు చూస్తుంటే ఆధార్ కార్డ్ డిసెంబర్ 19 నాటికి ఖచ్చితంగా ఉండాలని. ఆధార్ కార్డు కూడా లేకుండా అమ్మ ఒడి ఇవ్వాలని ఆంధ్రజ్యోతి అడగదలచుకుందా అంటే అర్థం కాదు. అన్నింటికీ ఆధార్ ఓ ప్రధానాధారంగా మారిన రోజుల్లో రూ.15వేలు ఇస్తున్నప్పుడు ఆధార్ కార్డు ఉండాలని అడగడమే తప్పు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అంధజ్యోతి అనడానికి సరిపోతుంది. మరో షరతు ఆగష్ట్ 31 నాటికి విద్యార్థికి 5 ఏళ్లు నిండి ఉండాలని. అంటే ఐదేళ్ల లోపు వాళ్లకు కూడా అమ్మ ఒడి ఇవ్వాలని అడుగుతారా.. అంటే రెండేళ్లకో, ఏడాదిన్నరకో ఎవరైనా బిడ్డల పేర్లు బడిలో నమోదు చేస్తే వారికి కూడా అమ్మ ఒడి కింద డబ్బులివ్వాలని అడగదలచుకుందా.. ఆంధ్రజ్యోతి అసలు బాధ అంతా అమ్మ ఒడి పథకం అనూహ్యంగా విజయవంతం కావడం, బిడ్డల చదువులకు ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో విద్యారంగంలో వస్తున్న మార్పులకు సదరు జ్యోతి సహించలేకపోతోంది.

అందుకే అమ్మ ఒడి చుట్టూ అర్థ సత్యాలు అల్లేసి అందరినీ వంచించగలమని భావిస్తోంది. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయన్నది అంగీకరించేలని తనం నుంచి వస్తున్న కథనాలుగా వీటిని పలువురు అభివర్ణిస్తున్నారు. కనీస షరతులు కూడా లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం ఎవరి వల్లా కాదు. పైగా ఇవన్నీ పథకం ప్రారంభం నుంచి ఉన్నవే అనే విషయాన్ని సదరు జ్యోతి అర్థం చేసుకుంటే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి