iDreamPost

ఇంతకన్నా దిక్కుమాలిన వార్తలు వండి వార్చగలవా.. ఆంధ్రజ్యోతి తీరుపై ఏలూరు వాసుల గుర్రు

ఇంతకన్నా దిక్కుమాలిన వార్తలు వండి వార్చగలవా.. ఆంధ్రజ్యోతి తీరుపై ఏలూరు వాసుల గుర్రు

ఇంతకన్నా దిగజారి వార్తలు ఇవ్వగలరా అనుకున్న ప్రతీసారి..అంచనాలను తలకిందులు చేయడం ఆంధ్రజ్యోతికి అలవాటుగా మారింది. అందుకు తాజా ఉదాహరణ ఏలూరు చుట్టూ సాగిస్తున్న విష ప్రచారం. ఏలూరులో సమస్య ఉందన్నది వాస్తవం. హఠాత్తుగా వెలుగులోకి వచ్చిన సమస్యకు అసలు కారణాలపై వైద్య నిపుణులపై మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్ర బృందాలు పలు విధాలా కసరత్తులు చేస్తున్నాయి. తొలుత లెడ్, ఆ తర్వాత ఆర్గానో క్లోరిన్స్..తాజాగా ఇతర కారణాలు కూడా తోడయి ఉండవచ్చని విభిన్నమైన అంచనాలు వస్తున్నాయి. కానీ అసలు కారణాలు, అందుకు విరుగుడు ఏంటన్నది మాత్రం ఇంకా అంతు చిక్కలేదు.

సమస్య ఉన్నప్పుడు, సామాన్యులు సతమతం అవుతున్నప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రజ్యోతి అందుకు విరుద్ధం. జగన్ మీద గుడ్డి వ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కథనాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు అధికారం కోల్పోయిన నాటి నుంచి సహించలేనితనం వారిని చుట్టుముట్టిన్నట్టు స్పష్టమవుతోంది. అందుకు తగ్గట్టుగానే అనేక కహానీలు నిత్యం తమ మీడియాలో వల్లించడం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం ఏలూరులో కుదుటపడుతున్న పరిస్థితిలను కూడా కబోది మాదిరి చూడ నిరాకరించిన ఆంధ్రజ్యతి అంధజ్యోతిగా వ్యవహరించిన తీరు విస్మయకరంగా మారుతోంది.

గత శనివారం మధ్యాహ్నం తర్వాత మొదలయిన వింత వ్యాది బాధితులు ఒక్కసారిగా ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల్లో 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కానీ రెండు రోజులుగా అది నిదానించింది. గురువారం 25 మంది, శుక్రవారం కేవలం 10 మంది లోపు మాత్రమే అలాంటి సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. వాస్తవానికి సమస్య వెలుగులోకి రాగానే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హుటాహుటీన వైద్య సిబ్బందిని, సామాగ్రిని, అంబులెన్సులను తరలించింది. వీధికో అంబులెన్స్ ని పెట్టి ఎప్పుడు ఏ అవసరం వెంటనే కాల్ కి అటెండ్ అయ్యేలా చేసింది. ప్రతీ సచివాలయం పరిధిలో హెల్త్ క్యాంప్ కొనసాగిస్తోంది. తాగునీటి సరఫరా విషయంలో శ్రద్ధ పెట్టి తగు జాగ్రత్తలు పాటిస్తోంది. అన్నింటి ఫలితంగా మరణాల వరకూ వెళ్లకుండా కొన్ని గంటల వ్యవధిలోనే బాధితులు ఆస్పత్రి నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడింది. మొత్తం 610 మంది బాధితుల్లో ప్రస్తుతం కేవలం 13 మంది మాత్రమే శుక్రవారం రాత్రి సమయానికి ఆస్ప్రతిలో ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వ కృషి అర్థమవుతుంది. కేవలం ఒక్కరు మాత్రమే తొలిరోజు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారంతా సురక్షితంగా ఇంటికి చేరడం గమనిస్తే వైద్య బృందాల ప్రయత్నాలు గుర్తించవచ్చు.

కానీ ఆంధ్రజ్యోతికి ఈ వాస్తవాలు ఎన్నడూ పట్టవని మరోసారి అర్థమయ్యింది. ఏలూరు వాసులు తినడానికి లేదు..తాగడానికి లేదు అంటూ ఊరొదిలిపోదామా అనే హెడ్డింగుతో ఏలూరు నగరంపై పచ్చిగా విషం జల్లింది. ఏలూరులో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొనడం తనకు ఇష్టం లేదని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజలంతా తిరిగి సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో కలకలం రేపడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అపోహలతో ప్రజలను పక్కదారి పట్టించే లక్ష్యంతో ఉన్నట్టు అర్థమవుతోంది. ఇళ్లకు తాళాలు వేశారని,పిల్లలను ఊర్లు దాటిస్తున్నారని, ఉద్యోగులు కూడా సెలవు పెడుతున్నారని … ఇలా హద్దు మీరి అబద్ధాలను వండి వార్చిన తీరు పట్ల ఏలూరు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు 250 మంది అస్వస్థతకు గురయిన నాడు కూడా ఏలూరు వాసులు కలత చెందలేదు. నిదానంగా కారణాలు తెలుసుకుంటూ, జాగ్రత్తలు పాటించారు. కానీ ఆంధ్రజ్యోతికి అది కనిపించదు. ప్రజలను మరింత భయపెట్టే ప్రయత్నమే తప్ప, వాస్తవాలు తెలిసే వరకూ ప్రజలను ఊరటకల్పించేలా చేయాలనే ఉద్దేశం ఉండదు. దాంతో వేమూరి రాధాకృష్ణ వ్యక్తిగత స్వార్థంతో ఏకంగా నగర వాసులను కలవరపరిచే యత్నానికి ఒడిగట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎవరో కుటుంబం బస్సు ఎక్కుతున్న ఫోటో పట్టుకుని, కహానీలు చెబుతున్న తీరు మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

నిజానికి ఏలూరులోనే కాదు..ఏ ఊరులోనయినా నిత్యం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు, వచ్చే వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఏలూరు నగరం కాబట్టి కనీసం వేలల్లో ఉంటారు. దానిని కూడా భూతద్దంలో చూపించి భయభ్రాంతులకు గురిచేయాలనే కక్షపూరిత ధోరణిలో ఉన్న పత్రికా యాజమాన్యం తీరు పట్ల సామాన్యులు సైతం గుర్రుగా ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో లేకపోతే ఇంత పచ్చిగా ప్రజలను వంచించాలని చూస్తున్న తీరు సహించకూడదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి