iDreamPost

మా నాన్న , త‌బ‌లా క్లాస్‌లు!

మా నాన్న , త‌బ‌లా క్లాస్‌లు!

ఒకే రోజు ఫాద‌ర్స్ డే, మ్యూజిక్ డే, యోగా డే అన్నీ క‌లిసి కట్టుగా వస్తే దేని గురించి రాసేది? అన్నింటిని క‌లిపి రాసేస్తే ఒక ప‌నై పోతుంది. మా నాన్న‌తో నాకేం పెద్ద అనుబంధం లేదు. నాకే కాదు, నా జ‌న‌రేష‌న్‌, అంత‌కు ముందు త‌రాల వాళ్ల‌కి కూడా నాన్నంటే ఒక భ‌యం మాత్ర‌మే. దీనికి కార‌ణం ఇప్ప‌టిలా స్కూళ్ల‌కి తీసుకెళ్లి వ‌ద‌ల‌డం, ఇంట్లో ప్రేమ‌గా హోంవ‌ర్క్ చేయించ‌డం ఇవ‌న్నీ లేని కాలం.

నాన్న ఇంట్లో ఉంటే ఏదో ఇర‌కాటం. ఆయ‌న గంభీరంగా ఉంటే బిక్కుబిక్కుమ‌ని ఫీలింగ్‌. ఆయ‌న బ‌య‌టికి వెళ్లిపోతే రిలీఫ్‌. శిక్షించ‌డం వ‌ల్ల పిల్ల‌లు బాగుప‌డ‌తార‌నే న‌మ్మ‌కం ఉన్న నాన్న‌లు వాళ్లంతా. వాళ్ల నాన్న‌లు (తాత‌య్య‌లు) ఇంకా భ‌యంక‌రంగా ఉండేవాళ్లు.

నేను , నా స్నేహితులు చాలా మంది నాన్న ప్రేమ కంటే క‌ఠిన‌త్వాన్నే చూస్తూ పెరిగాం. శేఖ‌ర్ అనే వాడికి వాళ్ల నాన్న క‌నిపిస్తేనే వ‌ణుకు. బ‌జార్లో ఎక్క‌డైనా ఎదురైతే పారిపోయేవాడు.

సారంగ‌య్య అనే ఆయ‌న పిల్ల‌ల్ని ఇష్ట‌మొచ్చిన‌ట్టు కొట్టేవాడు. దెబ్బ‌లు ఎక్క‌డ త‌గులుతున్నాయ‌నే స్పృహ కూడా ఉండేది కాదు. ఆయ‌న మూడో కొడుకు (నా కంటే రెండేళ్లు పెద్ద‌) తండ్రి హింస‌ని భ‌రించ‌లేక పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సారంగ‌య్య దుమ్ములో పొర్లిపొర్లి ఏడ్చాడు. ఆయ‌నంటే కోపం రాలేదు, దుఖ్కం క‌లిగింది. పిల్ల‌ల్ని ప్రేమ‌గా కూడా పెంచొచ్చ‌ని ఆయ‌న‌కి తెలియ‌దు.

శివ‌రాం అని ఒక మిత్రుడు ఉండేవాడు. అత‌నికి మార్కులు త‌క్కువొచ్చాయ‌ని వాళ్ల నాన్న వీధిలోని క‌రెంట్ పోల్‌కి క‌ట్టేసి కొట్టాడు. దాని వ‌ల్ల వాడు మ‌రింత మొద్దు స్టూడెంట్‌గా త‌యార‌య్యాడు.

ఇప్ప‌టి నాన్న‌ల్ని చూస్తే నాకు భ‌లే ముచ్చ‌ట‌. చ‌దువు పేరుతో పిల్ల‌ల‌కి బాల్యం లేకుండా చేస్తున్నారు కానీ, ప‌నిగ‌ట్టుకుని తిట్ట‌డం కొట్ట‌డం చేయ‌డం లేదు. మా నాన్న ఇలా లేక‌పోయాడే అనే బాధ కూడా క‌లుగుతుంది. లోప‌ల ఇది ఉండ‌డం వ‌ల్లే మా అబ్బాయిపైన నాన్న దౌర్జ‌న్యం ఎప్పుడూ చూపించ‌లేదు. పాత త‌రం నుంచి మ‌నం నేర్చుకోవాల్సింది ఏమంటే వాళ్లు చేసిన త‌ప్పులు మ‌నం చేయ‌కుండా ఉండ‌డ‌మే.

ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే అది దేవుడి భాష‌. సంగీతం లేని ప్ర‌పంచాన్ని మ‌నం ఊహించ‌లేం. జీవితం పాటలా సాగినా సాగ‌క‌పోయినా పాట లేక‌పోతే జీవిత‌మే లేదు. అన్న‌మయ్య కీర్త‌న‌లో కంటే అమ్మ జోల‌పాట‌లోనే నాకు ఎక్కువ సంగీతం వినిపిస్తుంది.

మా పై ఫ్లోర్‌లో ఉన్న అమ్మాయి త‌న నెల‌ల బిడ్డ‌కి రోజూ జోల పాడుతుంటే అది గాలిలో తేలుతూ వినిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి సంగీతం , రాగం తెలియ‌దు. కానీ ఆ పాట‌లో చ‌క్కెర‌, తేనె, పాలు క‌లిసిన మాధుర్యం ఏదో జారుతూ ఉంటుంది. మ‌ధ్య‌లో నిద్ర పోకుండా బిడ్డ అరుపులు, కేక‌ల ముందు ఇళ‌య‌రాజా, రెహ్మాన్ కూడా సాటి రారు.

సంగీత‌మంటే ఇష్టం ఉంటే చాల‌దు, డ‌బ్బులు కూడా ఉండాలి. పాతికేళ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు వెయ్యి రూపాయ‌లు పెట్టి టేప్ రికార్డ‌ర్ కొన‌లేక పోయాను. 16 ఏళ్ల వ‌య‌సులో త‌బ‌లా నేర్చుకుందామ‌ని వెళ్లాను. గురువు చాలా పేద‌రికంలో ఉన్నారు. ఆయ‌న అడిగిన ఫీజుని ఇవ్వ‌లేనంత నిస్స‌హాయ స్థితిలో నేనున్నాను (ఇంట‌ర్ ఫెయిలై త‌బ‌లా నేర్చుకుంటానంటే , నా వీపు మీద మా నాన్న త‌బ‌లా మోగిస్తాడ‌ని నాకు తెలుసు).

ఒక రోజు ధ‌ర్మ‌వ‌రం రైల్వేస్టేష‌న్ వ‌ద్ద అంధ గాయ‌కులు పాడుతుంటే ఈ గురువు త‌బ‌లా వాయిస్తూ డ‌బ్బులు అడుక్కుంటున్నాడు. సంగీతం అద్భుత‌మే కానీ, ఆక‌లి తీర్చేంత అద్భుతం కాద‌ని అర్థ‌మైంది.

త‌ర్వాత జ‌ర్న‌లిస్టుగా ఉద్యోగం, సంగీతం విన‌డం త‌ప్ప , నేర్చుకోవ‌డం సాధ్యం కాలేదు. జీవితం చూస్తూ ఉండ‌గానే అయిపోతుంద‌ని నాకు తెలుసు. అందుకే 2014లో గిటార్ కొన్నాను. గురువు కోసం వెతికేలోగా ట్రాన్స్‌ఫ‌ర్ వ‌చ్చింది. చిరాకుతో ఉద్యోగం మానేశాను కానీ గిటారు నేర్చుకోలేక పోయాను. మా ఇంటికి ఎవ‌రైనా చిన్న పిల్ల‌లు వ‌స్తే దాని తీగ‌ల్ని టింగ్‌టింగ్‌మ‌ని మోగిస్తూ ఉంటారు.

చివ‌రికి 2019లో ఎట్ట‌కేల‌కు త‌బ‌లా నేర్చుకుందామ‌ని డిసైడ్ అయి మ‌ణికొండ‌లో ఉన్న మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌కి ఫోన్ చేశా. నా గొంతు విని ఒకావిడ “మీ అబ్బాయికా సార్” అని అడిగింది. “కాదు, నేనే” అంటే మీ ఏజ్ ఎంత అని అడిగింది. 50 + అని చెబితే కాసేపు ఏమీ మాట్లాడ‌కుండా వ‌చ్చే నెల‌లో త‌బ‌లా క్లాస్‌లు ఉంటాయ‌ని చెప్పింది.

త‌బ‌లాకి బ‌దులు క‌రోనా వ‌చ్చింది. సంగీతం గురించి వ్యాసాలు రాయ‌డం త‌ప్ప ఇక నేర్చుకునేది ఏముంది? ఇక యోగా చాలా పెద్ద విష‌యం, అందుకే దాని గురించి నాకేమీ తెలియ‌దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి