iDreamPost

జగన్ ని స్వయంగా ఆహ్వానించిన అమిత్ షా, మరి చంద్రబాబుని?

జగన్ ని స్వయంగా ఆహ్వానించిన అమిత్ షా, మరి చంద్రబాబుని?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా కేంద్రం కనికరం కూడా ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఎంతో ప్రయాసపడిన తర్వాత ఒక్కసారి మోడీ నుంచి ఫోన్ కాల్ రావడంతోనే ఆయన పెద్దగా ప్రచారం చేసుకునే వరకూ వచ్చింది. అంతేగాకుండా తాజాగా తాను మోడీకి వ్యక్తిగతంగా విరోధిని కాదని, ఆయన్ని ఎన్నడూ కించపరచలేదని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. అయినా ఇప్పటి వరకూ ఆశించినట్టుగా జరగడం లేదు. ఓవైపు ఏపీలో పాలక వైఎస్సార్సీపీ దూకుడుతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కాపాడే వారి కోసం చంద్రబాబు సైతం తీవ్రంగా శోధించాల్సి వస్తోంది.

అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. చైనా తో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో మోడీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ప్రధాని హోదాలో లాక్ డౌన్ సడలింపులపై నిర్వహించిన నిన్నటి వీడియో కాన్ఫరెన్స్ కి జగన్ దూరమయ్యారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన వీలు కుదరకపోవడంతో పాల్గొనలేదని సీఎంఓ ప్రకటించింది.

రేపటి సమావేశానికి జగన్ హాజరుకావాలని తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. తొలుత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్ని పార్టీల నేతలను ఆహ్వానించడంలో భాగంగా జగన్ కు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆతర్వాత కొద్దిసేపటికే మళ్లీ అమిత్ షా నేరుగా ఫోన్ చేయడం ఆసక్తి రేపుతోంది. పార్లమెంట్ లో బలాల వారీగా వైఎస్సార్సీపీ ఓ ప్రధాన పార్టీగా ఉంది. దాంతో దానికి తగ్గట్టుగానే జగన్ ని గౌరవించారని కొందరు చెబుతుండగా, బీజేపీ అధిష్టానం వద్ద జగన్ పలుకుబడిని మరోసారి ఈ పరిణామం రుజువు చేస్తోందని కొందరు చెబుతున్నారు.

అదే సమయంలో చంద్రబాబుకి మాత్రం ఇప్పటి వరకూ ఆహ్వానం అందలేదు. కేవలం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఫ్యాక్స్ మేసేజ్ తప్ప ఇతర రూపాల్లో వారికి సమాచారం అందిన దాఖలాలే లేవు. దాంతో జగన్ ని అమిత్ షా ఆహ్వానించడం, బాబుకి కనీసం ఆహ్వానించే పరిస్థితి కూడా కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీకి దగ్గరవుదామని బాబు ప్రయత్నిస్తుంటే కమలనాధుల కన్ను జగన్ మీద ఉందా అనే సంకేతాలకు తాజా పరిణామాలు దారితీస్తున్నాయి. పార్లమెంట్ లో బలాల వారీగా చూసినప్పుడు టీడీపీకి అంత ప్రధాన్యత దక్కబోదని, అదే సమయంలో టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి సమాచారం తప్ప నేరుగా ఉండవల్లిలో ని చంద్రబాబుకి ఫోన్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఏమయినా ఏపీ రాజకీయాల్లో ఇదో ఆసక్తికర అంశంగానే చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి