iDreamPost

శాపంగా మారనున్న ఓవర్సీస్ పరిణామాలు

శాపంగా మారనున్న ఓవర్సీస్ పరిణామాలు

ఇప్పటికే భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో థియేటర్లు, మాల్స్ అన్ని మూతబడ్డాయి. జనసంద్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వాలు కూడా తీవ్రమైన చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఓవర్సీస్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే సుప్రసిద్ధ థియేటర్ చైన్లు తమ హాళ్లను 6 నుంచి 12 వారాల పాటు నిరవధికంగా మూసేస్తున్నామని ప్రకటనలు ఇచ్చాయి. యుఎస్ లో సినీమార్క్ తన 315 సైట్లను మూసేసింది. ఉద్యోగుల భద్రతే తమకు క్షేమమంటూ నోట్ కూడా ఇచ్చేసింది.

ఇదే కాదు రీగల్ సినిమాస్ యాజమాన్యంతో పాటు ఏఎంసి థియేటర్స్ కూడా ఇలాంటి ప్రకటనలే జారీ చేశాయి. చాలా తీవ్రమైన వాతావరణం నెలకొని ఉందని ఎప్పుడు కుదుటపడుతుందో చెప్పడం కూడా సాధ్యం కాదని చెబుతున్నాయి. అమెరికాలో ఏఎంసికు 630 లొకేషన్లలో సుమారు 11 వేల స్క్రీన్లు ఉన్నాయి. ఇవన్నీ షట్ డౌన్ అయ్యాయి. ఇలాంటి నిర్ణయాలు ముందే పసిగట్టిన హాలీవుడ్ నిర్మాతలు రెడీగా ఉన్న క్వయిట్ ప్లేస్ 2, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 2020, నో టైం టు డై, వండర్ విమెన్ 1984, బ్లాక్ విడో, టెనెట్, హెయిట్స్, సోల్ లాంటి క్రేజీ సినిమాలన్నీ వాయిదా వేసేశాయి. వీటికి కొన్నింటికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ పరిణామాలకు మన టాలీవుడ్ కు చాలా సంబంధం ఉంది. స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అత్యంత కీలకం. నాని నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరికీ మంచి మార్కెట్ ఉంది. అక్కడ మూసేశారు కదా పర్వాలేదు ఇక్కడ రిలీజ్ చేసుకుందాం అనుకోవడానికి లేదు. వరల్డ్ వైడ్ ఒకేసారి విడుదల చేస్తేనే నిర్మాతకు లాభాలు. ఇప్పుడు వేలాది స్క్రీన్లు యుఎస్ లో మూతబడ్డాయి. అసలు ఎప్పుడు తెరుచుకుంటాయో జనం భయం లేకుండా ఎప్పుడు బయటికి వస్తారో అర్థం కావడం లేదు.

ఈ నేపథ్యంలో తొందరపడి రిలీజ్ డేట్లు ప్రకటిస్తే అంతే సంగతులు. ఎక్కువ లేట్ చేసే కొద్దీ ఎప్పుడో ఆగష్టు, దసరాలకు ప్లాన్ చేసుకున్న చిరంజీవి, ప్రభాస్ సినిమాలు సైతం చిక్కుల్లో పడతాయి. రాబోయే రోజులను అంచనా వేయడం తలలుపండిన ట్రేడ్ పండితుల వల్ల కూడా కావడం లేదు. ఓవర్సీస్ తో పాటు ఇక్కడా మొత్తం సద్దుమణిగితే తప్ప పెద్ద సినిమాల నిర్మాతలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మొత్తానికి కరోనా తాలూకు పరిణామాలు విపరీత రూపాలు దాలుస్తూ ఇటు బయ్యర్లకు నిర్మాతలకు ఇద్దరికీ ఎటుపాలుపోని సంకటాన్ని కలిగిస్తున్నాయి. చూద్దాం ఎక్కడికి దారి తీస్తుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి